
విజయవాడలో చిట్టీల పేరుతో వ్యాపారులు చేస్తున్న ఆర్థిక నేరాలు అన్ని ఇన్ని కావు. జిల్లా కమిషనరేట్ పరిధిలో ఇలాంటి కేసు రోజుకొకటి పుట్టుకోస్తుంది. ఇటీవల విజయవాడలో ముచ్చెర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి చిట్టిలకు గోల్డ్ స్కీమ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసారు. వాయిదాల పద్ధతిలో చిట్టీలు కడితే 5 గ్రాముల బంగారం లేదా డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి వందలాది మంది బాధితుల నుంచి కోట్లు వసూలు చేసారు. అయితే ప్రతి నెల చిట్టీలు కట్టినా.. బాధితులకు అటు బంగారం ఇటు డబ్బులు రెండు ఇవ్వకపోవడంతో పాటు రాత్రికి రాత్రి అదృశ్యం అయ్యాడు. దీనితో ఈ కేసులో బాధితులు అటు సిపి ఆఫీసుకు ఇటు పోలిసు స్టేషన్లకు క్యూ కట్టారు.
ఇదిలా ఉండగా భవానిపురం, మాచవరం పోలీసు స్టేషన్ల పరిధిలో సైతం ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. రోజు వారి కూలీలు, నెలవారి చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వారే లక్ష్యంగా పెట్టుకొని చిట్టీల పేరుతో కట్టించుకొని రాత్రికి రాత్రే మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. దీనితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారి విషయంలో ఉపేక్షించకూడదని భావించిన పోలీసులు వారిపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధం అయ్యారు.
ఇందులో భాగంగానే నగరంలో చిట్టీల వ్యాపారులకు విజయవాడ పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే 300 మంది చిట్టి వ్యాపారాలు ఉన్నట్లు గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు అనుమతులు లేకుండా చిట్టీలను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల వందల కోట్లను చిట్టీల పేరుతో స్కీమ్ పేరుతో వసూలు చేయడం, ఐపిలు పెట్టీ పారిపోవడం లాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో విజయవాడ సీపీ ఈ హెచ్చరికలు జారీ చేశారు.
చిట్టీల నిర్వహణ విషయంలో ఉన్న నిబంధనలు ఫాలో అవ్వాల్సిందేనని.. ఎవరైతే అనుమతులు లేకుండా అధిక వడ్డీల పేరుతో చిట్టీలను నిర్వహిస్తున్నారో వారిపై కేసులు పెట్టీ అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. చిట్టిలను నిర్వహిస్తున్న వారిని గుర్తించడం కోసం ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసిన సిపి రాజశేఖర్ బాబు స్వయంగా పరిస్థితిని మానిటర్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.