Tirumala Tirupati: కొందరు అసత్య ఆరోపణలు చేయడం వల్లే భక్తుల్లో గందరగోళం.. ఆ వార్తలను ఖండించిన టీటీడీ

Tirumala Tirupati: భక్తులకు అందించే ఉచిత సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మంగళం పలికిందని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను టీటీడీ ఖండించింది..

Tirumala Tirupati: కొందరు అసత్య ఆరోపణలు చేయడం వల్లే భక్తుల్లో గందరగోళం.. ఆ వార్తలను ఖండించిన టీటీడీ
Follow us

|

Updated on: Jul 02, 2021 | 10:36 PM

Tirumala Tirupati: భక్తులకు అందించే ఉచిత సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మంగళం పలికిందని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను టీటీడీ ఖండించింది. ఈ వార్తల ఆధారంగా కొంత మంది అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. భక్తులకు అందిస్తున్న ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలకలేదని స్పష్టం చేసింది. టీటీడీలో 2020 మార్చికి ముందు తిరుమ‌లలోని ల‌డ్డూ కౌంట‌ర్లు, క‌ల్యాణ క‌ట్ట త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే భ‌క్తులకు టోకెన్లు ఇచ్చే కౌంట‌ర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ద‌ర్శనం టికెట్లు, స్కానింగ్ కౌంట‌ర్లు, తిరుప‌తిలోని ఎస్‌ఎస్‌డి కౌంట‌ర్లు, అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న కౌంట‌ర్లు కలిపి 176 కౌంటర్లు ఉండేవని, ఇందులో త్రిలోక్ ఏజెన్సీ 89 కౌంటర్లు, వివిధ బ్యాంకులు 40 కౌంటర్లు, లడ్డూ సేవకులు 18 కౌంటర్లు, 7 ఎఫ్ ఎం ఏజెన్సీ 29 కౌంటర్లు ( నగదుతో) నడిపామని టీటీడీ తెలిపింది. త్రిలోక్ సంస్థ మార్చి 2020కి ముందే వారి సేవలు ఉపసంహరించుకుందని గుర్తు చేసింది. 29 కౌంటర్లు నడిపిన 7 ఎఫ్ ఎం ఏజెన్సీ కాంట్రాక్టు సమయం అయిపోయింది. నగదు లావాదేవీలు ఉన్నందున ఈ కౌంటర్లు నడపలేమని బ్యాంకులు వెనక్కు వెళ్లాయి. ఇదే కారణంతో శ్రీవారి సేవకుల సేవలు కూడా ఉపసంహరించామని తెలిపింది.

ప్రస్తుతం రెండు బ్యాంకులు మాత్రమే 16 లడ్డూ కౌంటర్లు నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాంకులు కూడా కౌంటర్లు తమ నుండి వెనక్కి తీసుకోవాలని టీటీడీపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శనానికి విచ్చేసే భ‌క్తుల‌కు పారదర్శకంగా, మరింత నైపుణ్యంగా సేవలు నిర్వహించాలని టీటీడీ భావించింది. ఇందుకోసం ఐదు సార్లు టెండర్లు పిలవగా ఐదవ సారి బెంగళూరుకు చెందిన‌ కెవిఎం ఇన్‌ఫో అతి తక్కువ ధరకు టెండ‌రు వేసింది. అయితే గతంలో ఒక కౌంటర్‌లో ఒక షిఫ్ట్ కు రూ.12,345 ( జిఎస్టీ కాకుండా) ఉండగా, ప్రస్తుతం రూ.11,402 కే ( జిఎఎస్టీ కాకుండా) టెండరు ఖరారైంది. ఈ టెండర్లు కూడా ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని టీటీడీ తెలిపింది.

టీటీడీ అవసరాలకు అనుగుణంగా కౌంటర్ల సంఖ్యను 176 నుండి 164కు తగ్గించింది తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వృత్తి నైపుణ్యతకు సంబంధించి వీరికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. కౌంటర్లలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా ఉండేందుకు ఈ కొత్త విధానం ద్వారా రోటేష‌న్ ప‌ద్దతిలో రెండు నెలలకు ఒక సారి సిబ్బందిని మార్చే వెసులుబాటు ఉంది. భక్తుల విశాల ప్రయోజనాలు, మెరుగైన సేవల లక్ష్యంగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు అరకొరగా అర్థం చేసుకుని అసత్య ప్రచారాలు చేయడం సరైంది కాదని టీటీడీ వ్యాఖ్యానించింది.

శ్రీ‌వారి అర్జిత సేవా భ‌క్తులు శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకోవ‌చ్చు

తిరుమ‌ల శ్రీ‌వారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు క‌లిగిన గృహ‌స్తులు శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం టీటీడీ క‌ల్పించింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి జూన్ 30వ తేదీల మ‌ధ్య వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు పొందిన భ‌క్తులు బుకింగ్ తేదీ నుండి సంవత్సరంలోపు శ్రీ‌వారి దర్శనం చేసుకోవ‌చ్చని తెలిపింది. భక్తులు ఈ మార్పును గమనించి, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది.

ఇవీ కూడా చదవండి:

Tirumala Hundi: భారీగా పెరిగిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం.. జూన్‌ నెలలో ఎంత వచ్చిందంటే..!

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం వివాదంలో మరో ట్విస్ట్.. అందరిది ఒకే అభిప్రాయమన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.. అవాస్తమన్న మహాలక్ష్మమ్మ