AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో నో ఎంట్రీ! నిండిపోయిన క్యూలైన్లు.. కొండంత రద్దీ.. కొండల రాయుడి రికార్డ్..!

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అసాధారణ స్థాయిలో కొనసాగుతోంది. వేసవి సెలవులు, వీకెండ్‌ తోడుకావడంతో దేశం నలుమూలల నుండి భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో కొండపై ఎటు చూసినా భక్తుల జనసందోహమే కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

తిరుమలలో నో ఎంట్రీ! నిండిపోయిన క్యూలైన్లు.. కొండంత రద్దీ.. కొండల రాయుడి రికార్డ్..!
Ttd Sets A New Record
Balaraju Goud
|

Updated on: May 24, 2026 | 10:47 AM

Share

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అసాధారణ స్థాయిలో కొనసాగుతోంది. వేసవి సెలవులు, వీకెండ్‌ తోడుకావడంతో దేశం నలుమూలల నుండి భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో కొండపై ఎటు చూసినా భక్తుల జనసందోహమే కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

సాధారణ భక్తులకు తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సరికొత్త రికార్డు సృష్టించింది. సాధారణంగా శుక్రవారాల్లో స్వామివారికి జరిగే ప్రత్యేక పూజా కైంకర్యాల వల్ల దర్శన సమయం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, మే నెల 22న చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు 94,758 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున జరిగే అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం క్యూలైన్‌ను యథావిధిగా కొనసాగించడం వల్ల అదనంగా మరో 5,850 మందికి దర్శన భాగ్యం కలిగింది. ఆ రోజు సర్వదర్శనానికి మొత్తంగా 17 గంటలకు పైగా సమయాన్ని కేటాయించారు. ఈ మే నెలలోనే ఒక్కరోజు దర్శనాల సంఖ్య 90 వేలు దాటడం ఇది నాలుగోసారి కావడం విశేషం.

ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బాటగంగమ్మ గుడి వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. కంపార్ట్‌మెంట్‌లన్నీ నిండిపోవడంతో, అధికారులు శనివారం మధ్యాహ్నం నుంచి కొత్త భక్తులను క్యూలైన్లలోకి అనుమతించడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. రద్దీ తగ్గిన తర్వాతే క్యూలైన్లలోకి రావాలని మైకుల ద్వారా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ (ICCC) సాంకేతికత ద్వారా అధికారులు భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నడకమార్గాలు, వాహనాల ద్వారా వచ్చేవారిని అంచనా వేస్తూ ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తోంది. వేసవి సెలవులు ముగిసే వరకు తిరుమలలో ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉన్నందున, భక్తులు టీటీడీ అధికారులకు సహకరించాలని, తగిన ప్రణాళికతో రావాలని అధికారులు కోరుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us