Andhra: ఓ హోటల్ ముందు ఆపిన కారు నుంచి పిట్టల అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
శ్రీకాకుళం జిల్లాలో భారీ స్థాయిలో విదేశీ పక్షుల అక్రమ రవాణా బయటపడింది. పలాస–కాశీబుగ్గ రేంజ్ అటవీశాఖ అధికారులు దాడి చేసి 236 అరుదైన పక్షులను స్వాధీనం చేసుకున్నారు. కలకత్తా నుంచి చెన్నైకి తరలిస్తుండగా పట్టుబడ్డ ఈ పక్షుల విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లాలో విదేశీ పక్షుల అక్రమ రవాణా బయటపడింది. పలాస–కాశీబుగ్గ రేంజ్ అటవీశాఖ అధికారులు నిర్వహించిన సడెన్ రైడ్‌లో ఈ స్మగ్లింగ్ బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే… పలాస సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ రెస్టారెంట్‌లో విశ్రాంతి తీసుకుంటున్న స్మగ్లర్లను అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి కారులో వెతికేసరికి మొత్తం 236 విదేశీ పక్షులు దొరికాయి. విచారణలో ఈ పక్షులను కలకత్తా నుంచి చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.
వివిధ జాతులకు చెందిన ఈ రంగురంగుల పక్షులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో, వీటి విలువ లక్షల్లో ఉంటుందని అటవీశాఖ అంచనా వేస్తోంది. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పక్షులను ప్రస్తుతం పలాస–కాశీబుగ్గ ఫారెస్ట్ ఆఫీస్‌కు తరలించామని, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని రేంజ్ అధికారి మురళీకృష్ణం నాయుడు తెలిపారు.
