సర్కార్ భూములు కబ్జా…

భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కన్పిస్తే పాగా వేసేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలు ఎరజూపి రికార్డులు తారుమారు చేస్తున్నారు. అధికారుల ఆజ్యం కబ్జాదారుల భూదాహం వెరసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి స్వాహా అవుతోంది.

సర్కార్ భూములు కబ్జా...
Follow us

|

Updated on: Nov 05, 2020 | 8:22 PM

భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కన్పిస్తే పాగా వేసేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలు ఎరజూపి రికార్డులు తారుమారు చేస్తున్నారు. అధికారుల ఆజ్యం కబ్జాదారుల భూదాహం వెరసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి స్వాహా అవుతోంది. ఆక్రమణ దారులను విచారణకు పిలిపించిన తహశీల్దార్‌పై దాడికి యత్నించిన ఘటన ఏపీ సీఎం సొంత జిల్లాలో చోటు చేసుకుంది.

కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండల కోడూరు గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. భూ బకాసురులు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నారు. ఓ వ్యక్తి ఏకంగా సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నాడు. ఇటీవల రెవెన్యూ అధికారులు ఆక్రమణ జరిగిన భూములను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. అక్రమార్కులు సాగుచేసిన భూములకు వేసిన ఇనుప కంచెను తొలగించారు. అంతటితో ఆగకుండా ఆక్రమించిన భూమి వివరాల ప్రకారం అక్రమార్కులను రెవెన్యూ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

దీనిని జీర్ణించుకోలేక కొందరు అక్రమార్కులు, బడా నాయకులు తాహశీల్దార్ కార్యాలయానికి వచ్చి నానా యాగీ చేశారు. తిట్ల పురాణం తో మొదలు పెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడారు. మండల మెజిస్ట్రేట్ అనే విషయాన్ని మరచిపోయి అసభ్యంగా వ్యవహరించారు. పరిస్థితి చేయి దాటి పోతుందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితి చక్కదిద్దారు. ఈ ఘటనపై తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్న వారి వివరాలను తొలగించడానికి కలెక్టర్ కు అర్జీ పెట్టినట్లు తహశీల్దార్ తెలిపారు. గతంలో ఎర్రగుంట్లలో పనిచేసిన రెవెన్యూ అధికారులకు జిల్లా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసారు.