Political War: సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఇన్‌ఛార్జ్‌ల హాట్ ఫైట్.. చంద్రబాబు ప్రకటనతో పార్టీలో రాజుకున్న రాజకీయ వేడి..

సిట్టింగులకే టిక్కెట్లని చంద్రబాబు చెప్పడంతో..ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలు దూకుడు మీదున్నారు..మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్దులను ముందుగానే ప్రకటించే అవకాశాలు..

Political War: సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఇన్‌ఛార్జ్‌ల హాట్ ఫైట్.. చంద్రబాబు ప్రకటనతో పార్టీలో రాజుకున్న రాజకీయ వేడి..
Tdp
Sanjay Kasula

|

Sep 23, 2022 | 9:47 PM

వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా తెలుగుదేశం పార్టీ ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా అభ్యర్థుల ఖరారులో వేగం పెంచింది.. అధికార పార్టీ అభ్యర్ధుల బలాబలాలతో సంబంధం లేకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి కూడా టిక్కెట్లు కేటాయిస్తున్నారు.. పార్టీలో ప్రస్తుత సిట్టింగులకే మళ్లీ టిక్కెట్లు ఇస్తామన్న చంద్రబాబు ప్రకటనతో ప్రకాశం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకున్నట్లయ్యింది. టిడిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారట.. అందుకే వారికే మళ్లీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించారట.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఇప్పటికే టికెట్స్ ఖరారు చేసినందున అందరూ తమ తమ నియోజకవర్గాలలో ఇప్పటి నుంచే పట్టు పెంచుకునే పనిలో పడ్డారు.

టీడీపీలో చంద్రబాబుతో కలిపి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా పర్యటనలలో కొంతమందికి టికెట్లు ఖరారు చేశారు. త్వరలో మరింత మందికి ఖాయం చేయనున్నారు..అంటే 175 నియోజకవర్గాల్లో.. దాదాపు 50 నుంచి60 స్థానాలకు అతి త్వరలోనే అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉందట..మరోవైపు వైసీపీ కూడా..సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనీసం 60 నుంచి70 మందిని మార్చక తప్పదని ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్‌..

జగన్ సొంత సర్వేలో కూడా కనీసం 50 నుంచి 60 మంది పనితీరు బాగోలేదని తేలిందట..సో..పనితీరు మెరుగు పరుచుకోకపోతే వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఆశించవద్దని సిఎం జగన్ కుండబద్ధలు కొడుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో..సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ ఖరారు చేస్తున్నట్లు ప్రకటించి చంద్రబాబు.. సిఎం జగన్‌కు సవాల్ విసిరినట్టేనని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు..

అయితే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ సీట్లు ఉంటే.నాలుగింటిలో టిడిపి అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.. చీరాల, పర్చూరు, అద్దంకి, కొండపి నియోజకవర్గాలు టీడీపీవే.. కానీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టిడిపికి గుడ్‌బై చెప్పి..

వైసీపీకీ బయట నుంచి మద్దతు ప్రకటించారు.. దీంతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి ముగ్గురే మిగిలారు..అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్‌, పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, కొండపి నుంచి బాలవీరాంజనేయస్వామిలు తిరిగి వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులుగా బరిలో నిలవనున్నారు..

అంతవరకు బాగానే ఉంది కానీ.. టీడీపీ ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు..చంద్రబాబు నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారట.. పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాల్లో వైసిపి ఎమ్మెల్యేలతో నిత్యం పోటీ పడుతూ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్న తమ సంగతి కూడా తేల్చాలని పట్టుపడుతున్నారట..అధికారం కోల్పోయినప్పటి నుంచీ ఎన్నో ఇబ్బందులు పడుతూ.. పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రయత్నిస్తున్న తమకు టిక్కెట్లు ఇవ్వకుండా ఎన్నికల సమయంలో సర్వేల ఆధారంగా కొత్తవారిని రంగంలోకి దించితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట..

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఇప్పటి నుంచే సీట్లు ఖరారు చేసినట్లే.. నియోజకవర్గాల్లో చురుగ్గా పనిచేస్తున్న ఇన్‌చార్జిలకు కూడా టిక్కెట్‌ గ్యారంటీ అని చెప్పాలన్న డిమాండ్‌ తెరపైకి తెస్తున్నారట..ఇప్పటికే దర్శి టిడిపి ఇన్‌చార్జిగా ఉన్న పమిడి రమేష్‌ ఇటీవల పదవికి రాజీనామా చేశారు..ఇన్‌చార్జిగా ఉంటూ తాను పార్టీకోసం పనిచేస్తున్నానని, తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తున్నారా.. లేదా.. అన్న క్లారిటీ కోసం నేరుగా చంద్రబాబుతోనే భేటీ అయ్యారట..

అయితే టికెట్‌ ఇచ్చే విషయంలో హామీ లభించకపోవడంతో ఇంకెందుకీ కంచి గరుడ సేవ..అంటూ పమిడి రమేష్‌ పదవికి బైబై చెప్పేశారు. ఇలాంటి పరిణామాలతో కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అవుతుందేమోనని టిడిపిలోని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల బాబుకు ఇదే పరిస్థితి ఎదురవుతోందట.. మరి సిట్టింగులకే ఛాన్స్ అనే ప్రకటన పార్టీకి మేలు చేస్తోందో.. కొత్త తలనొప్పి తెస్తుందో కాలమే చెప్పాలంటున్నారు తమ్ముళ్లు..

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu