బాపట్ల పరిసర ప్రాంతాల్లో ర్యాప్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. అమాయకులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. పోలీసులు ఉక్కు పాదం మోపుతున్న అడపా దడపా ర్యాప్ గ్యాంగ్‌ల ఆగడాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ముప్పై మూడు లక్షల రూపాయలను అత్యంత్య తెలివిగా ర్యాప్ గ్యాంగ్ కొట్టేసింది. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాప్ గ్యాంగ్ సభ్యుల కోసం గాలిస్తున్నారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన కల్యాణ్ చక్రవర్తి హోల్ సేల్ దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతనికి నర్సరావుపేటకు చెందిన శ్రీను అనే రిటైల్ వ్యాపారి పరిచయం అయ్యాడు. కొద్దీ రోజులు పోయిన తర్వాత శ్రీను…. తనకు తెలిసిన రత్నం అనే స్నేహితుడిని కల్యాణ్ చక్రవర్తికి పరిచయడం చేశాడు. ఆ తర్వాత రత్నం తనకు తెలిసిన వాళ్ల దగ్గర బంగారం ఉందని తక్కువ ధరకే ఇస్తారని శ్రీనుకు చెప్పాడు. శ్రీను ఈ విషయాన్ని కల్యాణ్ చక్రవర్తకి చెప్పి తక్కువ ధరకే వస్తున్నప్పుడు కొనుక్కుంటే తప్పేంటని ప్రశ్నించాడు.
దీంతో శ్రీను మాటలు నమ్మిన కల్యాణ్ చక్రవర్తి ఇరవై ఐదు లక్షల రూపాయల తీసుకుని రత్నంతో కలిసి బాపట్ల సమీపంలోని మహాత్మాజీపురం వెళ్లారు. అక్కడ అప్పటికే ఉన్న రెడ్డి అనే వ్యక్తికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. త్వరలోనే బంగారం అందిస్తానని రెడ్డి చెప్పడంతో ఈ ముగ్గురు అక్కడి నుండి వచ్చేశారు. కొద్దీ రోజులు తర్వాత ఈ ముగ్గరు మరోసారి రెడ్డిని కలిశారు. అయితే బంగారం తీసుకొస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారని దాన్ని విడిపించాలంటే, మరో ఎనిమిది లక్షల రూపాయలు కావాలని నమ్మబలికాడు. దీంతో మరోసారి కల్యాణ్ చక్రవర్తి ఎనిమిది లక్షల రూపాయలను తీసుకుని శ్రీను, రత్నంలను వెంటబెట్టుకొని రెడ్డిని కలిశారు.
అయితే అదే సమయంలో పోలీస్ దుస్తుల్లో ఉన్న నలుగురు వచ్చి వీరందరిని చూసి ఏం జరుగుతుందని ప్రశ్నించారు. అయితే పోలీసులకు విషయం తెలిసిపోయిదంటూ రెడ్డి అక్కడ నుండి అందరిని తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు నిఘా ఉందని అందుకే బంగారం ఇవ్వలేకపోయామని రెడ్డి ఈ ముగ్గురికి మరోసారి బురిడీ కొట్టించాడు. త్వరలోనే బంగారం ఇస్తామంటూ నమ్మబలికాడు.
ఇలా రోజులు గడుస్తున్నా బంగారం మాత్రం కల్యాణ్ చక్రవర్తికి దక్కలేదు. దీంతో అనుమానం వచ్చిన కల్యాణ్ తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుండా బంగారు ఇవ్వకపోవడంతో వ్యాపారి కల్యాణ్ తాను మోసపోయినట్ల గుర్తించాడు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన పోలీసులు మాయగాడి కోసం వేట మొదలుపెట్టారు.
ర్యాప్ గ్యాంగ్స్ అంటే…
బాపట్ల పరిసర ప్రాంతాల్లో కొన్ని ముఠాలు తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ వ్యాపారులను నమ్మిస్తారు. ముందు ఒరిజినల్ బంగారం చూపించి దాన్ని చెక్ చేసుకున్న తర్వాతే డబ్బులు ఇవ్వాలని చెబుతారు. బాపట్ల పరిసర ప్రాంతాల్లోనే భారీ మొత్తాన్ని తీసుకురావాలని కండిషన్ పెడతారు. వ్యాపారులు వీరిని నమ్మి డబ్బులు తీసుకొచ్చిన సమయంలో ముఠా సభ్యులు నకిలీ బంగారంతో ఎక్సేంజ్ చేసుకుంటారు. అదే సమయంలో ముఠాకు చెందిన సభ్యులే పోలీసులు దుస్తుల్లో రైడ్‌కు వచ్చినట్లు నటిస్తారు. వీరిని చూసి గ్యాంగ్ సభ్యులు పారిపోండి అంటూ కేకలు వేసుకుంటూ వ్యాపారి వద్ద నున్న డబ్బులు తీసుకొని ఉడాయిస్తారు. బాపట్ల పరిసర ప్రాంతాలపై గట్టి పట్టుండటంతో క్షణాల్లోనే అక్కడ నుండి కనుమరుగై పోతారు.
అయితే వ్యాపారులు ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉంటున్నారు. ఈ తరహా మోసాలనే ర్యాప్ అంటారు. వీటిని నిర్వహించే వారిని ర్యాప్ గ్యాంగ్స్ అంటారు. బాపట్ల పరిసర ప్రాంతాల్లో గతంలో చాలా పెద్ద ఎత్తున ఈ గ్యాంగ్స్ ఉండేవి. అయితే పోలీసులు వరుస వెంట కేసులు నమోదు చేయడంతో చాలా వరకూ ఈ తరహా మోసాలకు అడ్డుకట్టపడింది. అయితే అడపాదడపా ఇటువంటి మోసాలు ఇంకా చోట చేసుకుంటూనే ఉన్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..