మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్..
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఈ ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న సిట్, ఎక్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం అరెస్ట్ చేశారు. ఇటీవల కస్టడీలో ఏ1 జనార్ధన్ నుంచి కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు అరెస్ట్‌కు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. అటు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆరోపించారు.

కల్తీమద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు.. ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి వారిని తరలించారు. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఈ సందర్భంగా ఆరోపించారు జోగి రమేష్. మరోవైపు జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఇబ్రహీంంపట్నంలోని ఆయన ఇంటిదగ్గర హైడ్రామా నెలకొంది. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ నిరసనకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఉదయం జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు.
