జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సినిమా నటుడు కల్యాణ్ కు రాజకీయమే తెలియదని అన్నారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని పరితపిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి రెండు సీట్లు కూడా రావని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్(CM Jagan) పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు. వైసీపీ పాలనలో ప్రతి పేదవాడు ఆనందంగా ఉన్నారనన్నారు. కుట్రలు చేసి సీఎం జగన్ ను జైలుకు పంపించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ(Sonia Gandhi), టీడీపీ లీడర్ చంద్రబాబునాయుడు నేడు రాజకీయంగా దెబ్బ తిన్నారని నారాయణ స్వామి మండిపడ్డారు. కాగా.. ఏపీ ప్రభుత్వంపై జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి, భవిష్యత్తు తరాలను కాపాడుకోవటానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో అమూల్యమైన వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజా ఆమోద పరిపాలన అందించడంలో అధికార వైసీపీ విఫలమైందని నాగబాబు ఆరోపించారు. దోపిడీకి గురవుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులు, ప్రకృతి సంపదను కాపాడే సమర్థత జనసేనకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను ఒక కార్యకర్తగా పనిచేస్తానంటూ నాగబాబు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..