Andhra Pradesh Rains: వరణుడు వదిలేటట్లు లేడుగా.. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి దంచికొట్టనున్న వర్షాలు..

అకాల వర్షాలతో ఏపీ‌ అతలాకుతలం అవుతోంది. అకాల వర్షాలకు కొన్ని జిల్లాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. మాండూస్‌ తుఫాను ప్రభావంతో ఈదురుగాలులకు కోతకొచ్చిన వరి నేల వాలింది.

Andhra Pradesh Rains: వరణుడు వదిలేటట్లు లేడుగా.. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి దంచికొట్టనున్న వర్షాలు..
Andhra Pradesh Weather
Follow us

|

Updated on: Dec 13, 2022 | 12:27 PM

అకాల వర్షాలతో ఏపీ‌ అతలాకుతలం అవుతోంది. అకాల వర్షాలకు కొన్ని జిల్లాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. మాండూస్‌ తుఫాను ప్రభావంతో ఈదురుగాలులకు కోతకొచ్చిన వరి నేల వాలింది. నీటిలో నానుతున్న పంటను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి..చెరువు కట్టపై నీటి ప్రవాహాన్ని చూస్తూ ప్రమాదవశాత్తూ వరద నీటిలో యువకుడు కొట్టుకుపోయాడు. మద్యం మత్తులో ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానికులు కాపాడారు.

చిత్తూరు జిల్లాపై తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. మాండస్‌ తుపాన్‌తో 900 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 626 చెరువులు పూర్తిగా నిండిపోయాయి.16 పునరావాస కేంద్రాల్లో 416 బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు కలెక్టర్‌ కోరారు. మరోవైపు జిల్లాలో గార్గేయ, నీవానదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదుల దగ్గర భారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు కాపలాగా ఉన్నారు. నిమ్మనపల్లి బహుదా ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరగడంతో 3 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు.

మాండుస్‌ తుఫాన్‌ ప్రకాశం జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. లక్ష ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మినుము, వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, కంది శనగ, పంటలకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..25 వేల ఎకరాల్లో పొగాకు నీట మునిగింది. పంట సాగు కోసం రైతులు ఇప్పటి వరకూ ఎకరాకు 25 నుంచి 50 వేల రూపాయల వరకూ ఖర్చు చేశారు. భారీ వర్షాలకు దాదాపు 200 కోట్ల రూపాయల మేర నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ గ్రామంలో చూసినా వందలాది ఎకరాల విస్తీర్ణంలో పంట పొలాలు వర్షపు నీటితో కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. మాండౌస్‌ తుఫాన్‌తోపాటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలహీనపడి సాయంత్రం అల్పపీడన ద్రోణిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రమంతా ముసురుపట్టింది. పలు జిల్లాలో ఇంకా చిరు జల్లులు కురుస్తున్నాయి. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తడిసిముద్దయ్యారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మరోసారి వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..