Cyclone Asani: దిశ మారుస్తూ.. అంతుచిక్కని విధంగా ‘అసని’.. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Cyclone Asani: దిశ మారుస్తూ.. అంతుచిక్కని విధంగా 'అసని'.. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
Asani Cyclone

కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ వర్షాలు..రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశముందని తెలిపింది.

Ram Naramaneni

|

May 11, 2022 | 9:31 PM

Ap Weather: అసని తీరం దాటింది. మచిలీపట్నం(machilipatnam)-నర్సాపూర్‌ దగ్గర పూర్తిగా తీరం దాటిన తుపాన్‌.. తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నర్సాపూరానికి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు బాపట్ల-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన అసని..ప్రస్తుతం నర్సాపూర్‌ వైపు పయనిస్తోంది. దాదాపు 4 గంటలుగా భూ ఉపరితలంపై కొనసాగుతున్న తుఫాన్‌..నర్సాపూర్‌ దగ్గర మళ్లీ సముద్రంలోకి ప్రవేశించనుంది. తీవ్ర వాయుగుండంగా మారిన అసని.. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. ఐతే తుఫాను బలహీనపడినా 24 గంటలపాటు దీని ప్రభావం ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ. కోస్తాంధ్రలో గంటకు 70 నుంచి 90కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇక ఇప్పటికే అసని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై విరుచుకుపడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బలమైన గాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. తుఫాన్ కారణంగా తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్మేశాయి. కాకినాడ, యానాం, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. పలు చోట్ల సముద్రం కూడా ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ వర్షాలు..రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశముందని తెలిపింది. తుపాను తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం..కోస్తా తీర ప్రాంతాల్లో ప్రతీ చోటా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది.

తుపానుపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు. తుపాను బలహీన పడినా నిర్లక్ష్యం వద్దన్నారు సీఎం జగన్‌. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి విశ్వరూప్. కోనసీమ ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం తీర ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక సూర్యలంక తీరంలో తుపాను పరిస్థితిని పరిశీలించారు కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్. అసని తుఫాన్‌ బలహీనపడటంతో విశాఖ నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించారు అధికారులు. హైదరాబాద్‌ సర్వీస్‌ను పునరుద్ధరించింది స్పైస్‌జెట్‌. ఇక సింగపూర్‌ విమానం యధావిధిగా నడపనున్నట్టు స్కూప్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేట తీరప్రాంతం పర్యాటకులతో సందడిగా మారింది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న కెరటాలతో యువత కేరింతలు కొడుతున్నారు. ఇరవై అడుగుల పైకి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న రాకాసి అలలతో ఆటలాడుతున్నారు. బీచ్ రోడ్డులో ఉన్న జియోట్యూబ్ రాళ్లపై నిల్చొని ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu