ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు.. రెండు స్థానాలకు 32 మంది దాఖలు..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. పంచాయితీ ఎన్నికలు ముగిశాయో లేదో మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి పార్టీలు.

  • Balaraju Goud
  • Publish Date - 7:33 am, Wed, 24 February 21
ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు.. రెండు స్థానాలకు  32 మంది దాఖలు..

AP mlc elections : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయితీ ఎన్నికల తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు రాబోతున్నాయి. ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. పంచాయితీ ఎన్నికలు ముగిశాయో లేదో మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి పార్టీలు. తాజాగా ఉపాధ్యామ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ నిన్నటితో ముగిసింది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

కృష్ణా – గుంటూరు జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. చివరి రోజు 11 మంది అభ్యర్థులు తమ అనుచరులతో ర్యాలీగా గుంటూరు కలెక్టరేట్‌ వద్దకు వచ్చి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కొందరు అభ్యర్థులు ముందుజాగ్రత్తగా రెండు, మూడు సెట్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన దృష్ట్యా ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం గుంటూరు కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అటు, తూర్పు-పశ్చిమగోదావరి ఎమ్మెల్సీ స్థానానికి 12 నామినేషన్లు వచ్చాయి. రెండు స్థానాలకు 32 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ తెలిపారు.

అయితే ఎన్నిక ఏదైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న పార్టీలు ఈ రెండు స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిప వైసీపీ, ప్రజలకు తమ పార్టీ మీద నమ్మకం తగ్గలేదని చెప్పుకుంటున్న టీడీపీ, కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్న బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది. తమ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గుంటూరు- కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి 20 మంది పోటీ పడటంతో ఇక్కడి నుంచి రెబల్‌ అభ్యర్థులను ఉపసంహరింపజేయాలని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

Read Also…  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీకులు నియామకం.. ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లకు బాధ్యతలు