వాళ్ళు అక్కడా ఓటేస్తారు.. ఇక్కడా ఓటేస్తారు.. ఎక్కడో తెలుసా? ఏ రాష్ట్రానికి ఆ ప్రజలు చెందుతారో తెలీకుండా దశాబ్దాలుగా సాగుతున్న కథ!

అక్కడి వారికి రెండు ఓట్లు.. రెండు రేషన్ కార్డులు.. అంతెందుకు ప్రతి ప్రభుత్వ పథకమూ రెండు రాష్ట్రాల నుంచీ అక్కడి ప్రజలకు అందుతాయి. ఎన్నో ఏళ్లుగా ఇలానే జరుగుతోంది. అవి ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు.

  • KVD Varma
  • Publish Date - 7:45 pm, Thu, 8 April 21
వాళ్ళు అక్కడా ఓటేస్తారు.. ఇక్కడా ఓటేస్తారు.. ఎక్కడో తెలుసా? ఏ రాష్ట్రానికి ఆ ప్రజలు చెందుతారో తెలీకుండా దశాబ్దాలుగా సాగుతున్న కథ!
Kotia Boarder Dispute

Kotia Border dispute: అక్కడి వారికి రెండు ఓట్లు.. రెండు రేషన్ కార్డులు.. అంతెందుకు ప్రతి ప్రభుత్వ పథకమూ రెండు రాష్ట్రాల నుంచీ అక్కడి ప్రజలకు అందుతాయి. ఎన్నో ఏళ్లుగా ఇలానే జరుగుతోంది. అవి ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు. అయితే, ఈసారి పరిషత్ ఎన్నికలకు అక్కడి గ్రామాల నుంచి ప్రజలు ఓటు వేయడాన్ని ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యంగా కోటియా గ్రామ ప్రజలను పోలీసులు బోర్డర్ దాటకుండా అడ్డుకోవడంతో రగడ మొదలైంది. ఏది ఏమైనా ఓటు వేసి తీరతామని ఆ గ్రామ ప్రజలు భీష్మించుకు కూచోవడంతో గొడవ పెద్దది అయింది. కోటియాలో ఉండే తొనామ్, మోసంగి పోలింగ్ కేంద్రాల వద్ద ఈ గలాటా జరిగింది.  ఆ గ్రామ ప్రజలు ఓటింగ్ కు రాకుండా అక్కడి పోలీసులతో పాటు, పలువురు ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకోవడమే కాకుండా రోడ్లపై బండరాళ్లను అడ్డుగా పెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇదొక్కటే కాదు నేరెళ్ళవలస, సారిక దగ్గర కూడా ఓట్లు వేయకుండా ఓటర్లను అడ్డుకున్నారు. ఇక మరోవైపు విజయనగరం జిల్లా అధికారులు ఒడిశా అధికారులతో మాట్లాడి ఓటింగ్ కు వచ్చేవారిని అడ్డుకోవద్దని కోరారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో చాలామంది ఓటు హక్కును వినియోగించుకోగలిగారు. అయితే, కొంతమందిని మాత్రం ఒడిశా అధికారులతో ఆ జిల్లా ఎస్పీ రాజకుమారి  మాట్లాడినా వారు స్పందించకపోవడం విశేషం.

అసలు ఆగ్రామాల్లో ప్రజలకు రెండు ఓట్లు ఎందుకు ఉన్నాయి? ఓటింగ్ విషయంలో ఎందుకు గొడవ జరిగింది తెలుకుందాం.

ఆ 21 కొటియా గ్రామాల రూటే సపరేటు!

అవును దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ కొటియా గ్రామాల పరిస్థితి ఉంటుంది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం, కోరాపుట్ రెండు జిల్లాలు ఉన్నాయి. విజయనగరం ఏపీలో ఉంటె.. కోరాపుట్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్నాయి ఈ కొటియా గ్రామాలుగా పిలవబడే 21 గ్రామాలు.  ఈ గ్రామాల్లో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు విడిపోయినప్పుడు సర్వే కూడాజరగలేదు. ఈ గ్రామాలపై ఏ రాష్ట్రానికి హక్కు ఉందనేది దశాబ్దాలుగా తేలని పంచాయతీగా ఉండిపోయింది. ఈ గ్రామాలు మావంటే మావి అంటూ ఎప్పుడో దశాబ్దాల క్రితమే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు. కానీ, ఈ విషయాన్ని పార్లమెంట్ లో తేల్చుకోమని చెప్పింది న్యాయస్దానం. దీంతో సమస్య ఎటూ తేలకుండా ఉండిపోయింది.

రెండు రాష్ట్రాల మధ్య తేలని తగవు..

ఈ తగవు ఇలా నడుస్తూనే ఉంది. దీంతో ఇటు ఏపీ, అటు ఒడిశా కూడా ఈ 21 గ్రామాల ప్రజలను తమ ప్రజలుగానే చూస్తున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి అన్ని ప్రభుత్వ పథకాలు ఇక్కడి ప్రజలకు అందుతూనే ఉన్నాయి. రేషన్ కారు, ఫించన్ ఇటువంటివే కాదు.. సర్కారీ బడులు.. ప్రభుత్వ కార్యాలయాలు కూడా రెండు రాష్ట్రాలవీ ఈ గ్రామాల్లో ఉంటాయి. గతంలో ఆ గ్రామాల గురించి ఒడిశా ప్రభుత్వం పెద్దగా పట్టించుకునేది కాదు. అయితే పదేళ్ల నుంచి ఆ గ్రామాలపై ఒడిశా ప్రభుత్వం ప్రయాతేక శ్రద్ధ పెట్టింది. అంతేకాకుండా రెండేళ్ల నుంచి అక్కడ ఒడిశా ప్రభుత్వ కార్యాలయాల కోసం శాశ్వత భవనాలు నిర్మిస్తూ వస్తోంది. అనేక చోట్ల  ఏపీ కి చెందిన తెలుగు బోర్డులను తొలగిస్తోంది.

తాజా రగడ ఇలా ప్రారంభం అయింది..

ఏపీ సర్కార్‌, ఎస్‌ఈసీ పై ఒడిశా ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తేదీన పిటిషన్‌ వేసింది. తమ భూభూగంలో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణ పై నవీన్‌ పట్నాయక్‌ సర్కార్ ఆక్షేపణ‌ తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా ఒడిశా ప్రభుత్వం చేర్చింది. ఏపీ ప్రభుత్వంపై ఏకంగా కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన ఒడిశా.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఓడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న పొట్టంగి తాలూకా పరిధిలోని మూడు పంచాయితీల పేర్లు ఏపీ మార్చినదని ఆరోపణలు చేసింది ఒడిశా. గతంలో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరపడం పై కూడా ఒడిశా సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండడంతో అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రయత్నం చేసింది.

అసలు సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

ఒడిశాలోని కొరాపూట్‌ జిల్లాలోని 21 గ్రామాలకు కొటియా గ్రామాలుగా పేరు. రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం జిల్లా, ఆ జిల్లాకు పొరుగున ఉన్న కోరాపూట్‌ జిల్లాఈ రెండు జిల్లాల మధ్య పూర్తి స్థాయిలో సరిహద్దు నిర్ణయం జరగలేదు. 1968లో ఈ గ్రామాల్లో ఏపీ అక్రమంగా చొరబడుతుందంటూ ఒడిశా సర్కార్‌ సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు యథాతథ స్ధితి కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. తరువాత 2006లో ఒడిశా పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇరు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారం అయ్యేవరకూ ఆ గ్రామాల్లో యథాతథ స్ధితి కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ 21 కొటియా గ్రామాలను తమ భూభాగంలో చేర్చుకుందనీ, పేర్లు మార్చి ఇప్పుడు ఎన్నికలు కూడా నిర్వహిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్న ఒడిశా.. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ఆరోపణలు గుప్పించింది.

ఒడిశా పేర్కొన్న పేర్ల మార్పులు ఇవే..

ఒడిశా గ్రామాలకు ఏపీ మార్చిన పేర్లు ఇవీ అంటూ ఒడిశా పిటిషన్‌ లో పేర్కొన్న వివరాలు ఇవే..

  • ఒడిశాలోని గంజాయ్‌ పదర్ గ్రామం పేరును గంజాయ్‌ భద్రగా,
  • ఫట్టు సెనరీ గ్రామాన్ని పట్టు చెన్నూరుగా,
  • ఫగు సెనరీ పేరును పగులు చెన్నూరుగా పేరు మార్పు

ఇలా పేర్లు మార్చి ఏపీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పిటిషన్‌లో దాఖలు చేసిన ఒడిశా సర్కార్‌.. తాము ఇవే గ్రామాల్లో  గతంలో ఎన్నికలు నిర్వహించామని చెబుతూ దానికి ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించింది ఒడిశా ప్రభుత్వం. అంతేకాకుండా ఏకగ్రీవం చేసిన, ఎన్నికలు నిర్వహించిన వివరాలు కూడా కోర్టుకు సమర్పించింది.

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదులుగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌, అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్
విజయనగరం జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పేర్లను ఒడిశా ప్రభుత్వం చేర్చింది. తమ భూభాగంలో ఎన్నికల నిర్వహణకు ఈ ముగ్గురు అధికారులను బాధ్యుల్ని చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. ఒడిశా పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ ఇంతవరకూ స్పందించలేదు.

మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు దశాబ్దాలుగా స్తబ్దుగా ఉన్న తగవును సరికొత్త పంచాయతీగా తెరమీదకు తీసుకువచ్చాయి. ఇప్పుడు సుప్రీం కోర్టులో కేసు ఎలా ఎవరి పక్షాన తీర్పు వస్తుందనేది ఆసక్తికరం. అన్నిటికన్నా ప్రధానంగా ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

Also read: Rakeshwar Singh Release: ఎట్టకేలకు జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల.. మధ్యవర్తుల సందేశానికి తలొగ్గిన మావోయిస్టులు

Viral News: యజమానిపై పులి ఆకస్మిక దాడి… కొమ్ములతో ఎగబడ్డ గేదెలు… లగెత్తిన టైగర్..