ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే జే బ్రాండ్లపై విచారణ, జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు పొడియం వద్ద నినాదాలు చేశారు. పలుమార్లు పోడియం వద్దకు రావద్దని స్పీకర్ హెచ్చరించారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో అసెంబ్లీ మొత్తం సమావేశాల నుంచి నలుగురు తెలుగు దేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, రామరాజు, అనగాని సత్యప్రసాద్‌లను సభ నుంచి సస్పెండ్ చేశారు. పొడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటానని సభాపతి చెప్పారు. దీంతో టీడీపీ సభ్యులు తమ తమ స్థానాల వద్ద నుంచి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మాట్లాడుతూ ‘సభకు సభ్యులుగా ఉన్న మీరు ప్రశ్నోత్తరాలలో పాల్గొంటారని ఎదురు చూశాం.. మీరు సభ గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ సభాపతి నలుగురు టీడీపీ సభ్యులను ఈనెల 25 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.