AP Assembly: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మొదటి రోజు గవర్నర్‌ ప్రసంగం.. 11న బడ్జెట్

AP Assembly: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మొదటి రోజు గవర్నర్‌ ప్రసంగం.. 11న బడ్జెట్
Ap Assembly

ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక మొద‌టిసారి పూర్తిస్థాయి స‌మావేశాలు జరగబోతున్నాయి.

Balaraju Goud

|

Mar 07, 2022 | 8:56 AM

Andhra Pradesh Assembly Budget session: ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. వైసీపీ(YCP) అధికారంలోకి వ‌చ్చాక మొద‌టిసారి పూర్తిస్థాయి స‌మావేశాలు జరగబోతున్నాయి. మార్చి 11న శాసనస‌భ‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy) బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టనున్నారు. ఈ సారి దాదాపు రెండున్నర ల‌క్షల కోట్లతో ప్రభుత్వం బ‌డ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరుగనున్న బీఏసీ భేటీ(BAC Meeting)లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండాతో బడ్జెట్‌ సమావేశాలకు అధికార పక్షం సిద్ధం కాగా, అమరావతి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. తాను మినహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు.

సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో మొద‌టి రోజు ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి గ‌వ‌ర్నర్ విశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్రసంగిస్తారు. స‌భ వాయిదా అనంతరం బీఏసీ స‌మావేశం ఉంటుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే అంశం ఈ భేటీలో నిర్వహిస్తారు. రెండో రోజు దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డికి ఉభ‌య స‌భ‌లు సంతాపం తెలుపుతాయి. సంతాప తీర్మానం అనంతరం సమావేశం ముగుస్తుంది. 11వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సరానికి బ‌డ్జెట్ ప్రవేశ‌పెడతారు. వ్యవసాయ బ‌డ్జెట్‌ను మంత్రి క‌న్నబాబు ప్రవేశపెడుతారు.

ఈ సమావేశాల్లో రాజధాని అంశం కీలకమయ్యే అవకాశం ఉంది. మూడు రోజల క్రితం మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం.. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తేల్చి చెప్పింది. కాని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామంటోంది. ఈ క్రమంలో ఈ సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగబోతున్నాయి.

హైకోర్టు తీర్పుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు.. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాల మధ్య అధికారాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌కు లేఖ రాశారు. శాసనాలను తయారు చేయడం, విధి విధానాలను రూపొందించడం శాసనసభ హక్కు, దానిని కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ లేఖలో వివరించారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక తొలిసారి పూర్తిస్థాయి బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రగ‌నున్నాయి. రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా పూర్తిస్థాయి స‌మావేశాలు జ‌ర‌గ‌లేదు. ఈసారి బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌ర‌గ‌డంతో పాటు ప్రభుత్వ ప్రాధామ్యాలు, సంక్షేమ ప‌థ‌కాల‌పై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రక‌ట‌న చేయ‌నుంది. మార్చి నెలాఖ‌రు వ‌ర‌కూ సమావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష టిడిపి సిద్ధమవుతోంది. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహం రచిస్తోంది. పోలవరం, అమరావతి, వివేకా హత్య, టిడ్కో ఇల్లు, రైతాంగ సమస్యలపై చర్చించాలని కోరుతోంది. అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరగాలని పట్టు బడుతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గత అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బాయ్‌కాట్ చేశారు. నిన్నటి టీడీఎల్పీ భేటీలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా అనే అంశంపై చర్చ సాగింది. ప్రజా సమస్యలపై చర్చ కోసం సభకు హాజరవ్వాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరుకానున్నారు.

Read Also…

Telangana Assembly: నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu