#COVID19 బడ్జెట్ సెషన్ వాయిదా.. ఆర్డినెన్స్‌కే జగన్ మొగ్గు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్వహణ నిరవధికంగా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. నిధుల వినియోగానికి ప్రత్యా్మ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇందుకోసం ఆర్డినెన్సు జారీ చేసేందుకు జగన్ సర్కార్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

#COVID19 బడ్జెట్ సెషన్ వాయిదా.. ఆర్డినెన్స్‌కే జగన్ మొగ్గు
Follow us

|

Updated on: Mar 25, 2020 | 2:19 PM

Jagan favors ordinance instead of budget session: మార్చి 31 లోగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆమోదింప చేసుకోవాల్సిన తరుణంలో కరోనా విరుచుకుపడడంతో ప్రత్యామ్నాయంవైపు మొగ్గు చూపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బడ్జెట్ ఆమోదానికి, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదానికి కనీసం అయిదు రోజుల సెషన్ నిర్వహించాల్సిన అవసరం వుండడం.. దానికి తగిన వాతావరణం లేకపోవడంతో ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ ద్వారా తాత్కాలిక వెసులుబాటుకు సిద్దమవుతున్నారు.

మార్చి 31వ తేదీ తర్వాత నిధుల వినియోగానికి వీలుగా ఆర్డినెన్సు జారీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో ఆర్డినెన్సు జారీకి ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. నేడో, రేపో ఆర్డినెన్సు జారీ చేయడం ద్వారా ఏప్రిల్ ఒకటి తర్వాత ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల విడుదలకు వెసులుబాటు పొందాలని, మే నెలలో గానీ, జూన్ నెలలోగాను బడ్జెట్ సమావేశాలను నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ కారణంగా బడ్జెట్ సెషన్ నిర్వహణకు అనుకూల వాతావరణం లేకపోవడంతో న్యాయ, రాజ్యాంగ పరమైన అంశాలను పరిశీలించి.. ఆర్డినెన్సు జారీకి రంగం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కనీసం మూడు నెలల కాలానికి ప్రభుత్వ నిధులను వినియోగించుకునేందుకు వీలుగా ఆర్డినెన్సు జారీకి చర్యలు ఆల్ రెడీ ప్రారంభం అయినట్లు చెబుతున్నారు. ఇవాళో, రేపో అధికారిక ప్రకటన జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మూడు నెలల కాలానికి నిధులు వినియోగించుకునేలా ఆర్డినెన్సు జారీ చేసి.. పరిస్థితి సద్దుమణిగాక బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.