ఏపీ అసెంబ్లీలో అదే సీన్.. పట్టువీడని ప్రతిపక్షాలు.. సభ కార్యక్రమాలకు అడ్డు తగలవద్దన్న అధికారపక్షం

ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు సభలో 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

ఏపీ అసెంబ్లీలో అదే సీన్.. పట్టువీడని ప్రతిపక్షాలు.. సభ కార్యక్రమాలకు అడ్డు తగలవద్దన్న అధికారపక్షం
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Dec 01, 2020 | 3:59 PM

ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు సభలో 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ, కరోనా నియంత్రణలో విజయవంతమైన ప్రభుత్వ చర్యలపై చర్చ జరగనుంది. కాగా, టిస్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.

ప్రతిపక్షాల తీరుపట్లు సీఎం జగన్ అసహనం

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన తీరుపట్ల ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్‌ మాట చెప్తే చేసి చూపిస్తాడు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుంది. మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలను ఇవ్వగలిగాం. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం అమలు చేశాం. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు. టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావ’ని సీఎం జగన్‌ అన్నారు.

అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సస్పెన్షన్‌..

సభా కార్యకలాపాలకు అడ్డుతగిలిన పాలకొల్లు టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడును ఒకరోజు పాటు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. రెండవ రోజు శాసనసభ కార్యక్రమాలకు సైతం టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. బిల్లులపై చర్చ జరగకుండా సభకు ఆటకం కలిగించారు. పొడియం ముందు నిలబడి నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్‌ అసెంబ్లీని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

పేదలందరికీ ఉచితంగా ఇళ్లను ఇవ్వాలిః రామానాయుడు

శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… 20లక్షల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని…వీటిల్లో 90శాతం టిడ్కో ఇళ్ళు పూర్తయ్యాయని తెలిపారు. ఏడాదిన్నరగా పేదలకు వాటిని స్వాధీనం చేయలేదని మండిపడ్డారు. దీంతో ప్రతినెలా అద్దె భారం మోపారన్నారు. నా ఇల్లు నా సొంతం కార్యక్రమంతోనే ప్రభుత్వంలో స్పందన వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇళ్లకు సంబంధించి పాత బకాయిలన్నీ చెల్లించి లబ్ధిదారులకు వాటిని అందచేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు వెళ్లి చంద్రబాబు ఇళ్ళు కావాలా జగన్ ఇళ్ళు కావాలా అని అడగటం ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు క్యాటగిరీల్లో నిర్మించిన ఇళ్ళు ఉచితమేనని ప్రతిపక్షంలో ఉండగా జగన్ హామీ ఇచ్చారని… ఇప్పుడు మాట మార్చటం తగదన్నారు. పేదలందరికీ ఇళ్లను ఉచితంగానే ఇవ్వాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.

టీడీపీ సభ్యుల నిరసనపై స్పీకర్‌ ఆగ్రహం

హౌసింగ్‌పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వమే అజెండాలో పెట్టినందున వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. అయినా టీడీపీ నేతలు వాయిదా తీర్మానంపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. అయినప్పటీకి టీడీపీ సభ్యులు పట్టువీడకుండా సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకోవడంతో స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలా గందరగోళం సృష్టించడం సమంజసం కాదని హితవు పలికారు. సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంః బుగ్గన

టీడీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. కావాలనే సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. దీంతో రాజేంద్రనాథ్‌ జోక్యం చేసుకున్నారు. సజావుగా జరిగే సభను టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, ఈ విధంగా అడ్డుకోవడం అన్యాయమన్నారు. అసెంబ్లీ జరిగితే ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలుస్తాయనే ఉద్దేశంతో ఇలా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బుగ్గన స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం

మాజీ మంత్రి పెనుమత్స సాంబశివ రాజు, మాజీ ఎమ్మెల్యేలు పి నారాయణరెడ్డి, ఖాలీల్‌ బాషాలకు శాసనసభ సంతాపం తెలిపింది. తర్వాత సభా కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ బిల్‌, ఏపీ ఆక్వా కల్చర్‌ సీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌, ఏపీ ఫిషరిస్‌ యూనివర్సిటీ బిల్‌-2020లపై చర్చను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతుండగానే టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు.

టీడీపీ శాసనసభ్యుల నిరసన ర్యాలీ

అంతకుముందు ఇప్పటికే నిర్మించిన టిడ్కో, హుద్ హుద్ ఇళ్లను లబ్జిదారులకు కేటాయించకపోవడంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన ర్యాలీ చేపట్టారు.భూసేకరణ పేరుతో అవినీతికి పాల్పడిన అంశంపై సభలో చర్చించాలని నేతల డిమాండ్ చేశారు.