గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల వివాదం… ఏం జరుగుతోంది?

స్థానిక పరిపాలనలో మార్పులు తేవాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ 2న వీటి కార్యకలాపాలు మొదలవ్వబోతున్నాయి. గ్రామ సచివాలయాల కోసం అవసరమైన సిబ్బందిని నియమించుకునేందుకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. రాతపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాలను అధికారులు సెప్టెంబరు 20న ఆయా జిల్లాలకు చేరవేశారు. ఉద్యోగాలకు అర్హత సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన కూడా మొదలైంది. అయితే, ఈ పరీక్షల్లో ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న కొందరికి టాప్ ర్యాంకులు రావడంతో  ఇప్పుడు వివాదం […]

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల వివాదం... ఏం జరుగుతోంది?
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 10:57 AM

స్థానిక పరిపాలనలో మార్పులు తేవాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ 2న వీటి కార్యకలాపాలు మొదలవ్వబోతున్నాయి. గ్రామ సచివాలయాల కోసం అవసరమైన సిబ్బందిని నియమించుకునేందుకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. రాతపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాలను అధికారులు సెప్టెంబరు 20న ఆయా జిల్లాలకు చేరవేశారు. ఉద్యోగాలకు అర్హత సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన కూడా మొదలైంది. అయితే, ఈ పరీక్షల్లో ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న కొందరికి టాప్ ర్యాంకులు రావడంతో  ఇప్పుడు వివాదం రేగుతోంది.

ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి, అన్ని రకాల ప్రభుత్వ సేవలు వాటి ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లోనూ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్పటికే నియమించిన గ్రామ వాలంటీర్లకు తోడుగా మరో 10మంది చొప్పున సిబ్బందిని నియమిస్తున్నారు. ఇందుకోసం ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ విద్యార్హతలు కలిగిన మొత్తం 1,26,728 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటివారంలో పరీక్షలు జరిగాయి.

మొత్తం 10 రకాల పోస్టులు వీటిలో ఉన్నాయి. ఈ పరీక్షలకు 19,58,582 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ విభాగాల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి, వారిలో 1,98,164 మందిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించింది. కొన్ని పోస్టులకు ఉన్న ఖాళీల కంటే తక్కువ మంది అర్హత సాధించగా, మరికొన్ని పోస్టులకు గట్టిపోటీ ఏర్పడింది. అర్హులైన వారు కుల, నివాస, విద్యార్హతా ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 27న నియామకాలు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి, వచ్చే నెల 2న వారిని విధుల్లోకి తీసుకుంటామని తెలిపింది.

అయితే, కొందరు ఏపీపీఎస్సీ సిబ్బందికి ఈ పరీక్షల్లో టాప్ ర్యాంకులు వచ్చాయి. పేపర్ లీక్ అయ్యిందన్న అనుమానాలతో కొన్ని కథనాలు కూడావెలువడ్డాయి. కొన్ని విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేటగిరీ-1 లో టాప్ ర్యాంక్ సాధించిన అనితమ్మ విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అర్హత సాధిస్తానని ముందు నుంచీ తాను ధీమాతో ఉన్నానని, కానీ మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని ఆమె మీడియాకు తెలిపారు.

ఏపీపీఎస్సీ తీరుపై చాలాకాలంగా ఉన్న విమర్శలకు తగ్గట్టుగానే తాజా పరీక్షల నిర్వహణ కనిపిస్తోందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు విమర్శించారు. ”గ్రామ సచివాలయ పరీక్షల్లో ప్రశ్నాపత్నం చాలా కఠినంగా ఇచ్చారు. అభ్యర్థులందరూ చాలా అవస్థలు పడ్డారు. ఫలితాలు చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయి. కేటగిరీ-1లో టాప్ ర్యాంక్ సాధించిన అనితమ్మ ఏపీపీఎస్సీలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఆమెకు టాప్ ర్యాంక్ రావడమే అందరికీ అనుమానాలకు తావిస్తోంది” అని ఆయన వివరించారు. ”ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారిని విధులకు దూరం పెట్టాల్సి ఉంటుంది. కానీ, వారలా చేయలేదు. దీనిపై విచారణ జరపాలి. ఎంతో మంది ఆశలు పెట్టుకుని, కష్టపడి పరీక్షలు రాశారు. ఇది ఏపీపీఎస్సీ వైఫల్యమే. ప్రభుత్వం విచారణకు సిద్ధం కాకపోతే ఆందోళన చేపడతాం” అని సూర్యారావు హెచ్చరించారు.

మరోవైపు… ఈ ఉద్యోగ నియామకాలపై దుమారం రేగుతోంది. ప్రశ్నాపత్రాలను లీక్ చేసి.. ఏపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఏం తమాషాలు చేస్తున్నారా? అని వైసీపీపై విరుచుకుపడ్డారు. రూ.5 లక్షలకు ఒక ఉద్యోగాన్ని అమ్ముకున్నారని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు లోకేష్. లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతూ.. 18 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.