అమెరికాలో విస్తృతంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్.. రెండో డోస్ టీకా తీసుకున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ అమోదం లభించడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

  • Balaraju Goud
  • Publish Date - 11:31 am, Wed, 27 January 21
అమెరికాలో విస్తృతంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్.. రెండో డోస్ టీకా తీసుకున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

Kamala harris Covid Vaccine :  కరోనా మహమ్మారి ప్రభావంతో అమెరికా విలవిలలాడింది. అగ్రరాజ్యంలో లక్షల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదుకాగా, అదే స్థాయిలో జనాలు మృత్యువాత పడ్డారు. దీంతో అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ అమోదం లభించడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టారు.

ఇదే క్రమంలో వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హారిస్ .. క‌రోనా టీకా రెండ‌వ డోసు వేయించుకున్నారు. నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ద్వారా ఆమె టీకా రెండో మోతాదు తీసుకున్నారు. మోడెర్నా సంస్థకు తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల‌ను ఆమె తీసుకున్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరిక‌న్లు అందరూ వ్యాక్సి‌న్ తీసుకోవాల‌ని ఆమె కోరారు. కాగా, కమలా హారీస్ సీ-స్పాన్ టీవీ లైవ్‌లో టీకా తీసుకున్నారు. టీకా ద్వారా కరోనా నుంచి పూర్తిస్థాయిలో విముక్తి కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.

ఇదిలావుంటే, డిసెంబ‌ర్ 29వ తేదీన క‌మ‌లా హ్యారిస్ తొలి డోసు టీకాను తీసుకున్నారు. వాషింగ్ట‌న్‌లోని యునైటెడ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో ఆమె ఆ టీకా వేయించుకున్నారు. ప్రస్తుతం అమెరికా రెండు కోవిడ్ టీకాల‌ను విస్తృతంగా పంపిణీ చేస్తోంది. గ‌త వారం రోజుకు ప‌ది ల‌క్షల మందికి టీకాలు వేస్తున్నట్లు అమెరికా హెల్త్ విభాగం వెల్లడించింది. వంద రోజుల పాల‌న పూర్తి అయ్యేలోగా సుమారు ప‌ది కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. అమెరికా నుంచి కరోనాను తరిమివేస్తామన్నారు.

Read Also… 18 ఏళ్లుగా పాకిస్తాన్ చెరలో మగ్గిన మహిళ… ఎట్టకేలకు విడుదలై సొంత ఊరికి చేరుకున్న హసీనాబేగం