జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు, వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ, ట్రంప్ ఆదేశం, భారీ దాడులకు కుట్ర జరుగుతోందా ?

ఈ నెల 20 న అమెరికా నూతన అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు .. నాడే పదవీ చ్యుతుడు కానున్న డొనాల్డ్ ట్రంప్..

  • Umakanth Rao
  • Publish Date - 1:47 pm, Tue, 12 January 21
జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు, వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ, ట్రంప్ ఆదేశం, భారీ దాడులకు కుట్ర జరుగుతోందా ?

ఈ నెల 20 న అమెరికా నూతన అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు .. నాడే పదవీ చ్యుతుడు కానున్న డొనాల్డ్ ట్రంప్.. ఆకస్మికంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్ లో ఎమర్జెన్సీని డిక్లేర్  చేశారు. ఇటీవల క్యాపిటల్ హిల్ లో తన మద్దతుదారుల చేత అల్లర్లను ప్రేరేపించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్నది తెలియడంలేదు.  క్యాపిటల్ భవనం వద్ద ఈ నెల 6 న జరిగిన ఘటనల్లో 5 గురు మరణించిన సంగతి తెలిసిందే. అటు-వాషింగ్టన్ లోని క్యాపిటల్ భవనంతో బాటు అన్ని రాష్ట్రాల్లో గల క్యాపిటల్ భవనాలపై దాడులకు కుట్ర జరుగుతోందని ఎఫ్ బీ ఐ హెచ్ఛరించింది. అత్యవసర పరిస్థితి విధించిన కారణంగా ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిష్కరించడానికి హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగంతో బాటు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ విభాగం కూడా యత్నిస్తుంది. అంటే ఈ విషయంలో ఈ రెండూ ఒకదానికొకటి సహకరించుకుంటాయి.

వాషింగ్టన్ లో సోమవారం నుంచి ఈ నెల 24 వరకు అత్యవసర పరిస్థితి అమలులో ఉంటుంది. స్టాఫర్ట్ చట్టం లోని టైటిల్ ‘వీ’ కింద ప్రజల ప్రాణాలు, ఆస్తులు, ఆరోగ్య పరిరక్షణకు ఈ విభాగాలు చర్యలు తీసుకుంటాయి. ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దేశంలోని 50 రాష్ట్రాల్లో గల క్యాపిటల్స్ లో సాయుధ నిరసనలు చెలరేగవచ్ఛునని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భావిస్తోంది. యూఎస్ నేషనల్ గార్డ్ బ్యూరో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. తన అభిశంసనకు సెనేట్ సన్నాహాలు మొదలుపెడుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్.. వాషింగ్టన్ లో అత్యవసర పరిస్థితిని విధిస్తు తీసుకున్న నిర్ణయం వెనుక ఏ ఉద్దేశం దాగున్నదో అర్థం కాకుండా ఉందని అంటున్నారు.

ఇదిలా ఉండగా ట్రంప్ ను బ్యాన్ చేసినందుకు అమెజాన్, ట్విటర్, ఇతర టెక్ సంస్థలకు కొత్త దెబ్బ తగిలింది. ట్విటర్, అమెజాన్ షేర్లు నిన్న తగ్గిపోయాయి. ట్విటర్ షేర్ అయితే 6 శాతం తగ్గింది. ట్రంప్ మద్దతుదారైన పార్లర్ సంస్థ అమెజాన్ పై దావా వేసింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది అమెజాన్ పరిస్థితి !

Also Read:

తమిళనాడులో ఘోర ప్రమాదం.. విద్యుత్ వైర్లను తాకిన ప్రైవేట్ బస్సు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు

What’s App Privacy Policy: ఆ వార్తలన్ని అవాస్తవం.. మీ డేటా భద్రతకు మేం రక్షణ.. క్లారిటీ ఇచ్చిన వాట్సప్..

దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 12,584 పాజిటివ్ కేసులు, 167 మరణాలు..