అమెరికాలో మంచు తుఫాను.. జనజీవనంపై మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రభావం

అమెరికాలో హిమపాతం శీతాకాలమొస్తే హిమపాతం సాధారణమే. అయితే ఈసారి మంచు తుఫాను ప్రమాదకరస్థాయిలో ఉంది. జనజీవనంపై మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రభావం...

అమెరికాలో మంచు తుఫాను.. జనజీవనంపై మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రభావం
Follow us

|

Updated on: Jan 27, 2021 | 10:02 PM

Historic Snow Storm :  అమెరికాలో హిమపాతం శీతాకాలమొస్తే హిమపాతం సాధారణమే. అయితే ఈసారి మంచు తుఫాను ప్రమాదకరస్థాయిలో ఉంది. జనజీవనంపై మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో రహదారులపై అడుగుల ఎత్తున మంచు పేరుకుపోవటంతో.. వాహనాల రాకపోకలకు బ్రేక్‌ పడింది. రోడ్లపై, మార్గమధ్యంలో మంచులో చిక్కుకుపోయిన చాలామందిని రక్షణబృందాలు బయటికి తీసుకురావాల్సి వచ్చింది.

లాస్‌ఏంజెల్స్‌ నగర పరిస్థితి మరీ ఘోరం. దాదాపు 18 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. పశ్చిమ నెవాడా, సియార్రాలను హిమపాతం ముంచెత్తుతోంది. లాస్‌ఏంజెల్స్‌, సాన్‌ జాక్విన్‌ లోయ మధ్య టెంజాన్‌ పాస్‌ దగ్గర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో అంతర్రాష్ట రవాణానికి తాత్కాలికంగా ఆపేశారు లాస్‌ఏంజెల్స్‌ పోలీసులు. తూర్పు కెర్న్‌ కౌంటీలోని తెహఛాపీ పాస్‌ దగ్గర మంచు గుట్టలు రాకపోకలకు బ్రేకేశాయి.

మంచు తుఫాను వారంరోజులుగా కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవారం తీవ్రరూపం దాల్చిన స్నో సైక్లోన్‌.. గురువారందాకా తీవ్ర ప్రభావం చూపబోతోంది. శాన్‌ఫ్రాన్సిస్కో బేలోని ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలొచ్చే అవకాశం ఉండటంతో…ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతాక్రజ్‌ కౌంటీ సహా పలు ప్రాంతాలను అప్రమత్తంచేశారు. కొందరిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మంచు తుపానుకు తోడు బలమైన గాలులు వీస్తుండటంతో…ఈ శీతాకాలం అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ప్రమాదఘంటికలు మోగిస్తోంది. రెండ్రోజుల్లోనే రికార్డ్‌స్థాయిలో హిమపాతం నమోదైంది, 1969లో 48 గంటల్లో కురిసిన 23 అంగుళాల రికార్డ్‌ని అధిగమించేలా కురుస్తోంది మంచువర్షం. శాన్‌ఫ్రాన్సిస్కోకోలో ఈనెలలో సగటున 4.19 అంగుళాల హిమపాతం నమోదైంది. శాన్‌ఫ్రాన్సిస్కోనుంచి శాంతాబార్బరా తీరప్రాంతందాకా 5నుంచి 10 అంగుళాల హిమపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

భిన్నమైన వాతావరణ పరిస్థితులు కాలిఫోర్నియాని తరచూ ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అయితే కరువు లేదంటే వరదలతో కాలిఫోర్నియా రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాల్లో చిక్కుకుంటోంది. ఇప్పుడు విపరీతమైన హిమపాతానికి తోడు, పెనుగాలులతో మంచుతుఫాను ముంచెత్తుతోంది.