కర్నాటకలో వివాదం రేపిన కేబినెట్ విస్తరణ, సీఎం ఎడ్యూరప్పను బ్లాక్ మెయిల్ చేశారని బీజేపీ నేతల ఆరోపణ

కర్నాటకలో కేబినెట్ విస్తరణ వివాదంగా మారింది. సాక్షాత్తూ కొందరు బీజేపీ నేతలేసీఎం ఎడ్యూరప్పపై  బాహాటంగా  ఆరోపణలు గుప్పించారు.

  • Umakanth Rao
  • Publish Date - 6:05 pm, Thu, 14 January 21
కర్నాటకలో వివాదం రేపిన కేబినెట్ విస్తరణ, సీఎం ఎడ్యూరప్పను బ్లాక్ మెయిల్ చేశారని బీజేపీ నేతల ఆరోపణ

కర్నాటకలో కేబినెట్ విస్తరణ వివాదంగా మారింది. సాక్షాత్తూ కొందరు బీజేపీ నేతలేసీఎం ఎడ్యూరప్పపై  బాహాటంగా  ఆరోపణలు గుప్పించారు. తనను సీడీతో బ్లాక్ మెయిల్ చేసినవారిని, తన సొంత విధేయులను ఆయన మంత్రివర్గంలో చేర్చుకున్నారని వారు విమర్శించారు. వీరిలో భారీగా ఆయనకు సొమ్ములు ముట్టజెప్పినవారు కూడా ఉన్నారన్నారు. ఒకరికి రాజకీయ కార్యదర్శి పదవిని ఇచ్చారని అన్నారు. విధేయత, కులం, సీనియారిటీ, సామర్థ్యం వంటివాటిని పరిశీలించలేదని, మా వంటి కార్యకర్తలను, సీనియర్లను పక్కన బెట్టారని బీజేపీ సీనియర్ నేత బసన గౌడ ఆర్ పాటిల్ మండిపడ్డారు. సీడీ చూపి మీ ప్రభుత్వాన్ని పడగొడతామని భయపెట్టినవారిని కేబినెట్ లో చేర్చుకున్నారు అని ఆయన అన్నారు. మరికొందరు బీజేపీ నాయకులు కూడా ఇలాగే రకరకాల ఆరోపణలు చేశారు. నిన్న ఎడ్యూరప్ప కేబినెట్ లో ఏడుగురు మంత్రులయ్యారు. వీరిలో ముగ్గురు ఆయన సన్నిహితులే ఉన్నారు.

అయితే ఈ ఆరోపణలను సీఎం సన్నిహితవర్గాలు ఖండించాయి. పదవులు దక్కలేదన్న ఆగ్రహంతో ఈ విధమైన విమర్శలు చేస్తున్నారని ఈ వర్గాలు పేర్కొన్నాయి.  ఎవరికి పదవులు ఇవ్వాలన్న విషయం ముఖ్యమంత్రికి  తెలుసునని, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని ఈ వర్గాలు వ్యాఖ్యానించాయి.