పెళ్లిల్లో హిందువా, ముస్లిమా అని న్యాయస్థానం చూడదు, మేజర్లయితే చాలు ః అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్య

లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టం తేవడానికి పలు రాష్ట్రాలు సంసిద్ధమవుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.. వివాహాలలో సదరు జంట హిందువా, ముస్లిమా అన్నది న్యాయస్థానం చూడదని, వారు మేజర్లా కాదా అన్నదే పరిగణనలోకి తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది.

  • Balu
  • Publish Date - 2:04 pm, Tue, 24 November 20
పెళ్లిల్లో హిందువా, ముస్లిమా అని న్యాయస్థానం చూడదు, మేజర్లయితే చాలు ః అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్య

లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టం తేవడానికి పలు రాష్ట్రాలు సంసిద్ధమవుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.. వివాహాలలో సదరు జంట హిందువా, ముస్లిమా అన్నది న్యాయస్థానం చూడదని, వారు మేజర్లా కాదా అన్నదే పరిగణనలోకి తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. మేజర్లకు వారి జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిని వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ ముస్లిం యువకుడిపై కేసు నమోదయ్యింది.. ఈ కేసుపై విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన సలామత్‌ అన్సారీ అనే ముస్లిం యువకుడు అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక ఖన్వార్‌ అనే హిందూ అమ్మాయి ప్రేమించుకున్నారు. నిరుడు ఆగస్టులో ఇద్దరూ పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే ప్రియాంక మతం మారి తన పేరును అలియాగా మార్చుకుంది.. పెళ్లి జరిగిన తర్వాత ప్రియాంక తండ్రి పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. తన కూతురు మైనర్‌ అని, ఆమెను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు చెప్పారు. పోలీసులు సలామత్ అన్సారీతో పాటు మరో ముగ్గురిపై పోస్కో చట్టం కింద కేసు పెట్టారు. దీంతో సలామత్‌, ప్రియాంక దంపతులు అలహాబాద్‌ కోర్టును ఆశ్రయించారు. సలామత్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. పెళ్లినాటికి ప్రియాంక వయసు 21 ఏళ్లు దాటినందున ఆమె మైనర్‌ కాదని తెలిపింది. తన భర్తతో కలిసి జీవించే హక్కు ప్రియాంక అలియాస్‌ అలియాకు ఉందని తెలిపింది. ఈ కేసులో పోస్కో చట్టం వర్తించదని తెలిపింది. సలామత్‌పై పెట్టిన కేసును కొట్టివేసింది.