తెలంగాణలో లెక్క తప్పిన ఎగ్జిట్ పోల్స్

All Exit Polls Are Gone Wrong in Telengana Lok Sabha Elections, తెలంగాణలో లెక్క తప్పిన ఎగ్జిట్ పోల్స్

ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కను ఆదివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ పేరుతో పలు సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. అన్ని పోల్స్ కూడా ఎక్కువగా బీజేపీనే తిరిగి అధికారంలోకి రాబోతుందని తేల్చి చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నట్లే.. బీజేపీకి భారీ మెజార్టీని కట్టబెట్టారు. అయితే తెలంగాణలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పాయి. పలు పేరుమోసిన మీడియా సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ కావటం గమనార్హం.

ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే-ఏక్సిస్ పోల్ సర్వే మాత్రం తెలంగాణ ఫలితాలకు దగ్గరగా తన అంచనాల్ని వెల్లడించింది. 10 నుంచి 12 సీట్లు టీఆర్ ఎస్ కు.. ఒకటి నుంచి మూడు సీట్లు బీజేపీకి.. కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి తగ్గట్లే తొమ్మిది స్థానాలు టీఆర్ ఎస్ కు.. బీజేపీకి నాలుగు.. కాంగ్రెస్ కు మూడు స్థానాలు సొంతం చేసుకోగలిగింది. మజ్లిస్ ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఇండియా టుడే మినహా మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు టీఆర్ఎస్ కు 12-15 స్థానాలు ఖాయమన్న లెక్కనే వినిపించాయి.

టైమ్స్ నౌవ్-వీఎంఆర్ పోల్స్ టీఆర్ ఎస్ కు 13 స్థానాలు.. కాంగ్రెస్ రెండు స్థానాలు.. బీజేపీ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం ఉందని చెబితే.. ప్రముఖ రిపబ్లిక్ ఛానల్- సీ వోటర్ సంస్థ అయితే టీఆర్ ఎస్ కు ఏకంగా 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్.. బీజేపీ.. మజ్లిస్ ఒక్కొక్క స్థానంలో గెలుస్తుందని వెల్లడించింది. ఇదే తీరులో పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని అంచనా వేయగా.. వాటి అంచనాలు విఫలమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *