పాక్‌, చైనాలతో యుద్ధానికి మోదీ ముహూర్తం పెట్టేశారు

కంట్లో నలుసులా మారిన పాకిస్తాన్‌, చైనాలతో యుద్ధానికి ప్రధాని నరేంద్రమోదీ సన్నద్ధమవుతున్నారా? సమరాంగణంలోకి ఎప్పుడు దూకాలన్నదానిపై మోదీకి క్లారిటీ ఉందా? ఉత్తరప్రదేశ్‌ భారతీయ జనతాపార్టీ అధ్యక్షడు స్వతంత్రదేవ్‌ సింగ్..

  • Anil m
  • Publish Date - 11:27 am, Mon, 26 October 20

కంట్లో నలుసులా మారిన పాకిస్తాన్‌, చైనాలతో యుద్ధానికి ప్రధాని నరేంద్రమోదీ సన్నద్ధమవుతున్నారా? సమరాంగణంలోకి ఎప్పుడు దూకాలన్నదానిపై మోదీకి క్లారిటీ ఉందా? ఉత్తరప్రదేశ్‌ భారతీయ జనతాపార్టీ అధ్యక్షడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ వ్యాఖ్యలను చూస్తే అలాగే అనిపిస్తోంది.. చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధం ఎప్పుడు చేయాలో మోదీ నిశ్చయించుకున్నారని స్వతంత్రదేవ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు సంచలనంగా మారాయి.. నిన్న సికందర్‌పూర్‌ ఎమ్మెల్యే సంజయ్‌ యాదవ్‌ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వతంత్రదేవ్‌ పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.. రామమందిరం, ఆర్టికల్‌ 370 విషయాలలో తీసుకున్నట్టుగానే పాక్‌, చైనాలతో ఎప్పుడు యుద్ధం చేయాలో నరేంద్రమోదీ నిర్ణయించేసుకున్నారని, యుద్ధం మాత్రం అనివార్యమని చెప్పుకొచ్చారు.. పనిలోపనిగా సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలను టెర్రరిస్టులుగా అభివర్ణించారు. ప్రస్తుతం ఇటు చైనాతోనూ, అటు పాకిస్తాన్‌తోనూ భారత్‌కు సంబంధాలు బాగోలేవు.. చైనానేమో మన భూభాగంపైకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.. పాకిస్తానేమో తన కపట బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు.. ఇలాంటి సమయంలో స్వతంత్రదేవ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.. చర్చకు కూడా దారితీసింది.. యుద్ధం సంగతి చెప్పాల్సి వస్తే అది రక్షణశాఖ మంత్రి చెప్పాలి కానీ స్వతంత్రదేవ్‌ సింగ్ ఎలా చెబుతారన్న ప్రశ్నను చాలా మంది వేస్తున్నారు.. అదే సమయంలో ఆయుధపూజలో పాల్గొన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాత్రం ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యంగా మెలగాలన్నదే తమ అభిమతమని, శాంతిని నెలకొల్పడమే కేంద్ర ఉద్దేశమని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. చైనాతో సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్న నమ్మకం ఉందన్నారు. స్వతంత్రదేవ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించలేదు కానీ బీజేపీ ఎంపీ రవీంద్ర కుశ్వాహ మాత్రం పార్టీ క్యాడర్‌లో ధైర్యాన్ని పెంచడానికే స్వతంత్రదేవ్‌ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అన్నారు.