మేమూ రెడీ.. ఒంటరిగానే పోటీ..అఖిలేష్ యాదవ్

akhilesh yadav, మేమూ రెడీ.. ఒంటరిగానే పోటీ..అఖిలేష్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు తాత్కాలికంగా తాము గుడ్ బై చెబుతున్నామని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ప్రకటనపై స్పందించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. బహుజన్ సమాజ్ పార్టీతో తాము కూడా తెగదెంపులు చేసుకోవడానికి రెడీ అని, యూపీలో 11 అసెంబ్లీ సీట్లకు జరగనున్న ఉపఎన్నికల్లో తామూ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. అయితే మాయావతి వ్యాఖ్యలను తమ పార్టీ ఇంకా కూలంకషంగా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. పొత్తు విషయంలో మా పార్టీ ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. కాగా-ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు తమకు లాభించ లేదని, అందువల్ల పొత్తుకు స్వస్తి చెబుతున్నామని నిన్న ప్రకటించిన మాయావతి.. కొంతవరకు తగ్గి.. తమ ప్రతిపాదన పరిమిత కాలానికి మాత్రమేనని, భవిష్యత్తులో ఆ పార్టీతో ‘ మైత్రి ‘ కొనసాగుతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేస్తాం అన్న మాయావతి ప్రకటనకు అఖిలేష్ కూడా కౌంటరిస్తూ.. ఎన్నికల్లో జయాపజయాలు సహజమేనని వ్యాఖ్యానించారు. ఓట్ల చీలిక, ప్రచార సరళి మొదలైనవి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *