అ‍క్బరుద్దీన్‌ ఒవైసీకి కీలక పదవి..కేబినెట్ ర్యాంక్ కూడా!

Telangana PAC Chairman, అ‍క్బరుద్దీన్‌ ఒవైసీకి కీలక పదవి..కేబినెట్ ర్యాంక్ కూడా!

తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవి ఎంఐఎం పార్టీని వరించింది.  ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి పీఏసీ చైర్మన్‌ పదవి దక్కింది. దీంతో ఆయన కేబినెట్ హోదా పొందనున్నారు. కాగా ఎంఐఎం పార్టీని ఈ పదవి వరించడం ఇదే తొలిసారి.  పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.

కాగా పీఏసీ చైర‍్మన్‌ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయం. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి  మెజార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో ఏడుగురు సభ్యులు ఉన్న మజ్లిస్‌ పార్టీ… తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలోనే కోరింది. తమకు మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం పట్ల సీఎం సానుకూల దృక్ఫదంతో ఉన్నారు. దాంతో పీఏసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.

ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.  అలాగే మరికొన్ని అసెంబ్లీ కమిటీలను స్పీకర్ ప్రకటించారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నడిచాయి. 58 గంటల 6 నిమిషాలు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశంలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *