కోహ్లీ, రోహిత్‌ల మధ్య విబేధాలు.. ఇన్‌స్టా చెప్పిన నిజాలు!

Virat Kohli Rohit Sharma Anushka Sharma, కోహ్లీ, రోహిత్‌ల మధ్య విబేధాలు.. ఇన్‌స్టా చెప్పిన నిజాలు!

ప్రపంచకప్ నుంచి టీమిండియా సెమీస్‌తోనే నిష్క్రమించడంతో.. జట్టులోని అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. అంతేకాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య కూడా విభేదాలు తలెత్తాయని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు కూడా వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని కోరుతున్న విషయం తెలిసిందే. మరోవైపు జట్టులో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని ఇన్‌సైడ్ టాక్. ఇది ఇలా ఉంటే.. ఆగష్టులో జరగబోయే విండీస్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోకుండా.. జట్టుతో పర్యటించడానికి సిద్దమయ్యాడు.

రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం ఇష్టం లేక విరాట్ కోహ్లీ.. తన మనసు మార్చుకుని విండీస్ టూర్‌కు సిద్ధమయ్యాడని సోషల్ మీడియాలో పుకార్లు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు తప్పని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇందుకు భిన్నంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలు వేరే ప్రశ్నలకు తలెత్తుతున్నాయి. గత సంవత్సరమే విరాట్ కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన రోహిత్ శర్మ.. తాజాగా కోహ్లీ భార్య అనుష్క శర్మను కూడా అన్‌ఫాలో చేయడం జరిగింది. దీనితో కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు షికారు చేస్తున్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం ట్విట్టర్‌లో రోహిత్ భార్య రితికను ఫాలో అవడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అటు కోచ్ భరత్ అరుణ్ మాత్రం జట్టులో ఆటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని పేర్కొన్నాడు. ‘ప్రతి విషయంపై జట్టులోని ఆటగాళ్ల అందరికి ఒకేలా అభిప్రాయాలు ఉండవు. జట్టు కూర్పు, వ్యూహాలపై వాద ప్రతివాదాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కానీ.. చివరకు అందరూ ఒకే నిర్ణయానికి వస్తారు’ అని భరత్‌ తెలిపాడు. రోహిత్ శర్మ తరుచూ కోహ్లీతో సంప్రదింపులు చేస్తాడని.. ఒకరి ఘనతలు.. మరొకరు ప్రశంసించుకుంటారని చెప్పాడు. కోహ్లీ, రోహిత శర్మ మధ్య సంబంధాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరత్ అరుణ్ పేర్కొన్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *