ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులి కలకలం !

ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. స్థానిక ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే పులి పలుమార్లు దాడి చేసి, ఆరు ఆవులను హతమార్చింది.

ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులి కలకలం !
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2020 | 10:42 AM

ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. స్థానిక ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే దాడి చేసి, ఆరు ఆవులను హతమార్చింది. పులి బారి నుండి తమను, తమ పశువులను కాపాడాలని శివారు గ్రామ ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఇందూరు పల్లి, ఘోల్లఘట్, తాంసి (కె) గ్రామాలు, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోనూ పులి ఆనవాళ్లు కనిపించాయి.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తంసి గ్రామానికి చెందిన దామోదర్ తన ఆవులను అడవిలోకి మేతకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో పులి దాడి చేయడంతో ఆరు ఆవులు మృత్యు వాత పడ్డాయి. పులి దాడి చేసిన విషయాన్ని గ్రామస్తులకు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పులిదాడి చేసిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అమర్చారు. వాటిని పరిశీలించగా పులి కదలికలు స్పష్టంగా కనిపించాయి. ఆవులను చంపింది పెద్దపులేనని నిర్ధారించారు.

భీంపూర్ మండలంలోని ఇందూర్ పల్లి, తాంసి(కె) గ్రామాల ప్రజలకు కంటినిండా కునుకు లేకుండా పోయింది. పులి భయంతో గత వారం రోజులుగా రైతులు పంట చేలకు వెళ్లకుండా భయం భయంగా గడుపుతున్నారు. గ్రామస్థులు డప్పులు, కర్రలతో గుంపుగా తిరుగుతున్నారు. పులి భయంతో పంట చేలలో పత్తి, కంది పంటలను వదిలేశామని గ్రామస్థులు వాపోతున్నారు.

పులి సంచారంపై ఫిర్యాదు చేసినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పొరుగున ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి పులుల వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామస్థులకు పులి నుంచి ఎలాంటి హాని జరుగకుండా చూస్తామని అటవీశాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్ ప్రజలకు భరోసా ఇచ్చారు.

పెద్దపులి తిరుగుతున్నందున అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లవద్దని.. పొలం పనులు కూడా త్వరగా ముగించుకొని సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్లాలని అధికారులు గ్రామస్తులకు సూచించారు. బేస్ క్యాంప్ నిర్వస్తామన్నారు. అయితే వారం రోజుల క్రితం కరణ్ వాడి, ఇందుర్ పల్లి అటవీ ప్రాంతాల్లో కూడా పెద్దపులి దాడిలో ఆవులు మృతి చెందాయి. అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు అమర్చినా..పులిజాడ కనిపించలేదు. కానీ పులి అడుగులను మాత్రం గుర్తించారు.

అక్కడి పులి, ఇక్కడి పులి ఒకటేనా.. వేర్వేరా.. అనే కోణంలో అధికారులు దృష్టి సారించారు. నెలరోజుల పరిధిలో పులి పంజాకు 6ఆవులు బలయ్యాయి. దీంతో పెన్‌గంగ పరివాహక ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కూలీ పనులకు వెళ్ళాలన్నా జంకుతున్నారు. అధికారులు వెంటనే పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు.