అదిల్‌ రషీద్‌..ఎమ్మెస్డీ రిప్లికా

Adil Rashid pulls off an MS Dhoni, అదిల్‌ రషీద్‌..ఎమ్మెస్డీ రిప్లికా

లీడ్స్‌: వికెట్‌ కీపింగ్ అంటే చాలు టీం ఇండియా ప్లేయర్ ధోని గుర్తొస్తాడు. కీపింగ్‌లో ఆయన స్థాయి వేరు..స్థానం వేరు.  అందుకే ఐసీసీ కూడా ధోని కీపింగ్‌ గురించి తెగపొగిడేసింది. స్టంప్స్‌ వెనక ధోనీ ఉంటే క్రీజు వదిలి వెళ్లకండని క్రికెటర్లకు ఒక సరదా సందేశం కూడా ఇచ్చిందంటే వికెట్ల వెనుక ధోని ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అచ్చం ధోనీలాగే ఇంగ్లాండ్‌ బౌలర్‌ అదిల్‌ రషీద్‌ కూడా బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేశాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన ఐదో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మ్యాచ్‌లో భాగంగా 351 పరుగుల ఛేదన లక్ష్యంగా పాక్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఇందులో భాగంగా 27 ఓవర్లో బాబర్‌ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్‌లో పాక్‌ కెప్టెన్ సర్ఫరాజ్‌ ఉన్నాడు. ఆ ఓవర్లో అదిల్‌ వేసిన బంతిని కెప్టెన్‌ ఆడాడు. సింగిల్‌ తీద్దామని లెగ్‌ సైడ్‌కి కొట్టాడు. అయితే బంతిని గమనించని బాబర్‌ క్రీజు మధ్యలోకి వచ్చేశాడు. దీన్ని గమనించిన వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ వెంటనే బంతి అందుకుని అదిల్‌వైపు విసిరాడు. దీన్ని అందుకున్న అదిల్‌..స్టంప్స్‌ వైపు చూడకుండానే వెనక్కి విసిరాడు. బంతి నేరుగా స్టంప్స్‌ను తాకింది. దీంతో బాబర్‌ ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ధోనీ కీపింగ్‌ను గుర్తుచేసేలా అదిల్‌ కీపింగ్‌ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *