రూ.10 వేల కోసం ప్రాణం తీసేందుకు యత్నం.. 24గంటల్లో యాసిడ్ దాడి ఘటనను ఛేదించిన పోలీసులు

అనుమానమే ఆమె పాలిట శాపంగా మారింది. అయినవారే యువతిని అంతం చేయాలనుకున్నారు. ఇందుకు రూ.10 వేలకు బేరం కూడా కుదుర్చుకున్నారు. ఫ్లాన్ బెడిసి కొట్టడంతో కటకటలాపాలయ్యారు.

రూ.10 వేల కోసం ప్రాణం తీసేందుకు యత్నం.. 24గంటల్లో యాసిడ్ దాడి ఘటనను ఛేదించిన పోలీసులు
Follow us

|

Updated on: Dec 26, 2020 | 4:56 PM

అనుమానమే ఆమె పాలిట శాపంగా మారింది. అయినవారే యువతిని అంతం చేయాలనుకున్నారు. ఇందుకు రూ.10 వేలకు బేరం కూడా కుదుర్చుకున్నారు. ఫ్లాన్ బెడిసి కొట్టడంతో కటకటలాపాలయ్యారు. జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారిన యువతిపై యాసిడ్ దాడి ఘటనను ఇబ్రహీంపట్నం పోలీసులు ఛేదించారు. యాసిడ్‌ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన ఓ వివాహిత(22) భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఆమెకు అదే గ్రామానికి చెందిన పుప్పాల గజేందర్‌(31)తో పరిచయం ఏర్పడింది. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో చంపడానికి గజేందర్‌ పథకం వేశాడు. ఇందుకు తన స్నేహితులైన డబ్బా గ్రామానికి చెందిన కుమ్మరి దినేశ్‌ (25), అమ్మక్కపేటకు చెందిన బంటు ప్రకాశ్‌(23)ల సహాయం తీసుకున్నాడు. ఆమెను హతమారిస్తే రూ.10 వేలు ఇస్తానని ప్రకాశ్‌తో ఒప్పందం కుదుర్చుకుని రూ.5 వేలు అడ్వాన్సుగా ఇచ్చాడు.

అయితే, ఈనెల 23న ఆమెపై యాసిడ్ దాడి చేసి హత్య చేయాలని దినేశ్, ప్రకాశ్‌లు నిర్ణయించుకున్నారు. మెట్‌పల్లిలోని బ్యాటరీ షాపులో యాసిడ్‌ తీసుకొని తిమ్మాపూర్‌లో ప్రకాశ్‌ సిద్ధంగా ఉన్నాడు. అనుమానం రాకుండా గజేందర్‌ కారులో తన ఇద్దరు చెల్లెళ్లు, ఆ మహిళతో కలిసి మెట్‌పల్లిలో షాపింగ్‌ చేశారు. అనంతరం బాధితురాలిని ఆమె తల్లి ఊరైన తిమ్మాపూర్‌ తండాలో దించాడు. వెంటనే ప్రకాశ్‌ ఆమె ముఖంపై యాసిడ్‌ పోశాడు. కొంత దూరంలో ద్విచక్రవాహనంపై సిద్ధంగా ఉన్న దినేశ్‌తో కలిసి యామాపూర్‌ వైపు పారిపోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో జిల్లా పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. 24గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు ఉపయోగించిన కారు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. నిందితులపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ సింధుశర్మ తెలిపారు.