ఉత్తమ అధికారిణి ఇంట్లో 93 లక్షల నగదు..

తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వీఆర్వోలే టార్గెట్‌గా ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా వీఆర్వో అనంతయ్య 4 లక్షల రూపాయల లంచం వ్యవహారం సంచలనం రేకెత్తించింది. తాజాగా మరో తహసీల్దార్ వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ. 8 లక్షలు డిమాండ్ చేసిన వీఆర్వో.. తనతో పాటు రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్యకు.. వాటా ఉందని చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను విచారించారు. లావణ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. బీరువాలు, కరెన్సీ బోర్డులలో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. సుమారు మూడు గంటల్లోనే రూ. 93.50 లక్షల నగదు, 42 తులాల బంగారు ఆభరణాలు లభించాయి. అయితే రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఆమెను ఉత్తమ అధికారిణిగా గుర్తించింది. తాజాగా ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో అధికారులే షాక్ కు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లావణ్యను అరెస్టు చేశారు. తనిఖీల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

దత్తాయపల్లికి చెందిన మామిడిపల్లి చెన్నయ్యకు 12 ఎకరాల భూమి ఉంది. అందులో 9.7 ఎకరాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అతని పేరు నమోదు కాలేదు. దీనిపై చెన్నయ్య కుమారుడు భాస్కర్‌ అనంతయ్యను సంప్రదించాడు. రూ.30 వేలు లంచం తీసుకొని ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేశారు. కానీ, గత నెల 18న ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసి 24న తొలగించారు. దాంతో, భాస్కర్‌ మళ్లీ అనంతయ్యను సంప్రదించగా.. ఈసారి ఎకరాకు రూ.లక్ష చొప్పున 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని భాస్కర్‌ చెప్పడంతో రూ.8 లక్షలకు ఒప్పందం కుదిరింది. దాంతో, భాస్కర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. బుధవారం కొందుర్గులో భాస్కర్‌ నుంచి అనంతయ్య రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇందులో రూ.5 లక్షలు కేశంపేట తహసీల్దార్‌ లావణ్యకు, రూ.3 లక్షలు వీఆర్వో అనంతయ్యకు ఇచ్చినట్లు డీఎస్పీ గుర్తించారు. ఎమ్మార్వోతో పాటు, వీఆర్ఓ ఇండ్లలో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *