ఒడిశా అధికార పీఠంపై ఐదోసారి.!

Naveen Patnaik, ఒడిశా అధికార పీఠంపై ఐదోసారి.!

బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఒడిశాకు ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2000లో మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆయన.. ఇప్పటివరకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఐదుసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జ్యోతి బసు, పవన్ చామ్లింగ్ సరసన నవీన్ పట్నాయక్ కూడా చేరారు. కాగా ప్రమాణస్వీకారం కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తన 19 ఏళ్ళ రాజకీయ ప్రయాణంపై ట్వీట్ చేశారు.

ఈ 19 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇక తనపై నమ్మకం ఉంచి.. తనకు మరోసారి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన 4.5 కోట్ల కుటుంబాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నవీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి 10 వేల మంది హాజరయ్యారని తెలుస్తోంది. అటు నవీన్ పెద్ద సోదరుడు ప్రేమ్ పట్నాయక్, సోదరి గీతా మెహతాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నవీన్ పట్నాయక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు నవీన్‌తో 20 మంది ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో సగం మంది ఎమ్మెల్యేలు తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎగ్జిట్ పోల్స్ నుంచి రాజకీయ విశ్లేషకులు వరకూ అందరూ కూడా ఈసారి ఒడిశాలో హాంగ్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేశారు. అయితే ఆ అంచనాలన్నింటిని తారుమారు చేస్తూ నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బీజేడీ 112 స్థానాల్లో విజయం సాధించింది. కాగా నవీన్ పట్నాయక్ కొత్త కేబినెట్‌లో 11 మంది పాత మంత్రులు కాగా.. 9 మంది కొత్తవారు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *