ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

Jammu kashmir Encounter, ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జైషే మహ్మద్‌ ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాన్‌తో పాటు ఓ సాధారణ పౌరుడు కూడా మరణించారు. పుల్వామా జిల్లా దెలిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు, భద్రతా దళాలు ఉగ్రవేట ప్రారంభించాయి. ఓ ఇంట్లోని వారందరినీ పోలీసులు బయటకు తరలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిపాయి సందీప్‌ వీరమరణం పొందగా, రయీస్‌ దార్‌ అనే పౌరుడు మరణించారు.

అనంతరం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. మృతిచెందిన ఉగ్రవాదులను పుల్వామా జిల్లా కరీమాబాద్‌కు చెందిన నసీర్‌ పండిత్, సోఫియాన్‌కు చెందిన ఉమర్‌ మిర్, పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్‌లుగా గుర్తించారు. కశ్మీర్‌లో జరిగిన పలు దాడుల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక షోపియాన్‌లోని హ్యండ్యూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో ఎదురు భద్రతా దళాలు అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *