కర్ణాటకలో ‘ వైస్రాయ్ ‘ సీన్ రిపీట్ ! ఛలో ‘ ముంబై హోటల్ ‘!

కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీ-ఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కష్టాల్లో పడింది. 8 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జేడీ-ఎస్ ఎమ్మెల్యేలు..మొత్తం 11 మంది రాజీనామాలు చేయడంతో పెను గండాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కుమారస్వామి అమెరికాలో ప్రయివేటు పర్యటనలో ఉండడంతో రాష్ట్రాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ 11 మంది సభ్యులూ తమ రాజీనామాలను శనివారం మధ్యాహ్నం స్పీకర్ కు సమర్పించారు. అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలుసుకున్నారు. ఆ తరువాత ప్రయివేటు జెట్ విమానంలో ముంబై చేరుకొని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన పక్షంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాల్సిదిగా కోరామని జేడీ-ఎస్ ఎమ్మెల్యేహెచ్. విశ్వనాథ్ తెలిపారు. రెండు రోజుల క్రితమే ఈయన తమ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. మరో కాంగ్రెస్ సభ్యుడు రామలింగారెడ్డి..తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తితో రాజీనామా చేసినట్టు తెలిపారు. అయితే ఆరాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్.. డి.కె. శివకుమార్.. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో భేటీ అయి కొద్దిసేపు సమాలోచనలు జరిపారు. వారి రాజీనామాలను తాను చించివేసినట్టు ఆయన చెప్పారు. అయితే ఇదంతా బహుశా ‘ డ్రామా ‘ అని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఢిల్లీలో శనివారం సాయంత్రం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు.. ప్రధాని మోదీ, ఆయనతో బాటు బీజేపీ..పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపించారు. ‘ ఆయారాం-గయారాం ‘ అన్న నినాదానికి ఇప్పుడు కొత్త నిర్వచనం చెప్పుకోవలసివస్తుందని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు.
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్, జనతాదళ్-ఎస్ సభ్యులు మొత్తం 116 మంది ఉన్నారు. (మెజారిటీ ఫిగర్ 113 ఉంటే సరిపోతుంది). 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, అవి ఆమోదానికి నోచుకున్న పక్షంలో.. కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. గత ఏడాది మే నెలలో ఏర్పడిన ప్రభుత్వం మొదటినుంచే దినదిన గండంలా నెట్టుకొస్తోంది. సంకెర్ణంలో తిరుగుబాట్లు సహజమయ్యాయి. సీఎం కుమారస్వామి సాక్షాత్తూ మీడియా సమావేశంలోనే
ఒకటిరెండుసార్లు కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. ఆయన అమెరికా నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చాక ఈ సంక్షోభాన్ని ఎలా నివారిస్తారో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *