చైనాతో ‘ టారిఫ్ వార్ ‘ కి ట్రంప్ రెడీ !

TRUMP, చైనాతో ‘ టారిఫ్ వార్ ‘ కి ట్రంప్ రెడీ !

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ రోజురోజుకీ ముదురుతోంది. తమ ఉత్పత్తులపై చైనా పెంచిన సుంకాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతున్నారు. తాజాగా వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ తో ఈ నెలలోతాను ఒసాకా (జపాన్) లో భేటీ అయినప్పుడు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తానన్నారు. , ఆ దేశంమొండికేస్తే తామూ వెనక్కి తగ్గబోమని, చైనా వస్తువులపై అత్యధిక టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. గ్రూప్ ఆఫ్ -20 సమ్మిట్ ను పురస్కరించుకుని ట్రంప్, జిన్ పింగ్ త్వరలో అక్కడ భేటీ కానున్నారు. చైనా వస్తువులపై 325 బిలియన్ డాలర్ల మేర సుంకాలు విధించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని ఇటీవల ఫ్రాన్స్ లో వెల్లడించిన ట్రంప్ .. జీ-20 శిఖరాగ్ర సమావేశం అనంతరం .. రెండు వారాల్లోనే తన ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ప్రస్తుతం బీజింగ్ వస్తువులమీద మేం 25 శాతం సుంకం విధిస్తున్నాం.. వాళ్ళు (చైనా) దిగిరాకపోతే ఈ శాతాన్ని మరింత పెంచుతాం అని ఆయన అన్నారు. జిన్ పింగ్ ఈ అంశంపై మాట్లాడేందుకు విముఖత చూపిన పక్షంలో ఇక చైనీయులకు మోత మోగడం ఖాయమని, 325 బిలియన్ డాలర్ల మేర సుంకాలను ఎదుర్కోవడానికి వారు రెడీగా ఉండాలని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి జిన్ పింగ్ గైర్ హాజరవుతారా అన్న విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు. చైనా నుంచి తమ దేశానికి ధన ప్రవాహం అందుతోందని, అయితే ఆ దేశం తమతో ట్రేడ్ వార్ కి సిధ్ధపడినట్టే కనిపిస్తోందని ఆయన అన్నారు. కాగా-తాము అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై చైనా భారీగా టారిఫ్ పెంచిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *